Crime News: బస్సును అడ్డగించి పోలీసుల కళ్లలో కారం చల్లి.. ప్రయాణికుల ఎదుటే హత్యకేసు నిందితుడిని కాల్చిచంపిన దుండగులు

Criminals Throw Chilli Powder At Cops and Shoot Murder Accused In Rajasthan
  • గతేడాది బీజేపీ నేత హత్య
  • ఇద్దరు నిందితులను కోర్టుకు తరలిస్తుండగా అడ్డుకున్న ముఠా
  • కాల్పుల్లో మరో నిందితుడికి గాయాలు
  • నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు
రాజస్థాన్‌లో దారుణం జరిగింది. హత్యకేసు నిందితులను కోర్టులో హాజరు పరిచేందుకు తీసుకెళ్తుండగా అడ్డుకున్న ఓ ముఠా పోలీసుల కళ్లలో కారం చల్లి నిందితులపై కాల్పులు జరిపింది. ఈ ఘటనలో ఒకరు చనిపోగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. స్థానిక బీజేపీ నేత కృపాల్ జఘీనా గతేడాది హత్యకు గురయ్యారు. ఈ కేసులో కుల్దీప్ జఘీనా, విజయ్‌పాల్ నిందితులు. కేసు విచారణలో భాగంగా భరత్‌పూర్ కోర్టులో వీరిని హాజరుపరిచేందుకు పోలీసులు జైపూర్ నుంచి ఆర్టీసీ బస్సులో బయలుదేరారు. 

బస్సు అమోలీ టోల్‌ప్లాజా వద్దకు చేరుకున్న సమయంలో కారు, బైకులపై మారణాయుధాలతో వచ్చిన 12 మంది దుండగులు బస్సును అడ్డగించారు. ఆపై లోపలికి వెళ్లి ఎస్కార్టు పోలీసుల కళ్లలో కారం చల్లి ప్రయాణికుల ఎదుటే నిందితులపై కాల్పులు జరిపి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన నిందితులను ఆసుపత్రికి తరలించగా కుల్దీప్ అప్పటికే మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. విజయ్‌పాల్ పరిస్థితి విషమంగా ఉంది. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుల్లో నలుగురిని పట్టుకున్నారు. మిగతా వారి కోసం గాలిస్తున్నారు.
Crime News
Rajasthan
Bharatpur
Jaipur

More Telugu News