Sonia Gandhi: బెంగళూరులో ప్రతిపక్ష పార్టీల భేటీకి సోనియా గాంధీ!

Sonia Gandhi to attend Bengaluru Opposition meet 24 parties to attend
  • ఈ నెల 17, 18వ తేదీల్లో సమావేశాలు
  • 24 పార్టీలకు ఆహ్వానం
  • గత నెల 23న బీహార్లో జరిగిన మొదటి సమావేశం
కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ ఈనెల 17, 18వ తేదీల్లో బెంగళూరులో జరిగే ప్రతిపక్ష నేతల తదుపరి సమావేశానికి హాజరవుతారని తెలుస్తోంది. దీనికి 24 పార్టీలను ఆహ్వానించినట్లు సమాచారం. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఐక్యతను పెంపొందించడానికి ప్రతిపక్ష పార్టీల మొదటి సమావేశం గత నెల 23న బీహార్‌లోని పాట్నాలో జరిగింది. తదుపరి బెంగళూరులో 17వ తేదీన అనధికారిక సమావేశంలో కీలక నేతలు భేటీ కానున్నారు. ఆ మరుసటి రోజు వీరిమధ్య అధికారిక చర్చలు జరగనున్నాయి. ఈ సమావేశంలో రాబోయే ఎన్నికల్లో ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్లాలనే దానిపై పార్టీల మధ్య విస్తృత అంగీకారానికి సంబంధించిన అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. 

తొలి సమావేశంతో పోలిస్తే దక్షిణాదికి చెందిన ఎనిమిది కొత్త పార్టీలు ఈ భేటీలో పాల్గొననున్నాయి. వాస్తవానికి ప్రతిపక్ష పార్టీల భేటీ ఈ నెల 13నే జరగాల్సి ఉంది. కానీ, మహారాష్ట్రలో శరద్ పవార్‌పై అజిత్ పవార్ తిరుగుబాటు చేయడంతో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ)లో చీలిక తర్వాత ఈ సమావేశం ఈ నెల 17కి వాయిదా పడింది.

కాగా, పాట్నాలో జరిగిన మొదటి సమావేశంలో 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఐక్యంగా ఎదుర్కోవాలని 15 ప్రతిపక్ష పార్టీలు నిర్ణయించుకున్నాయి. అయితే, ఆమ్ ఆద్మీ పార్టీ చివరి నిమిషంలో ఆ సమావేశానికి దూరం అవడంతో కూటమిలో ఆదిలోనే విభేదాలు బయటడ్డాయి. భవిష్యత్తులో ఢిల్లీ ఆర్డినెన్స్‌పై కాంగ్రెస్ బహిరంగంగా మద్దతు ప్రకటిస్తేనే తాము భేటీకి హాజరవుతామని ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు.
Sonia Gandhi
Congress
Opposition meet
Bengaluru
BJP

More Telugu News