Delhi: యమునా నది ఉగ్రరూపం... ఢిల్లీకి వరద ముప్పు

Delhi suburbs on the edge of flood as Yamuna swells dangerously
  • దేశ రాజధానిలో గత మూడ్రోజులుగా వర్షాలు
  • ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్న యమున
  • వేలాదిమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించిన ఢిల్లీ ప్రభుత్వం
  • ఉత్తరాది రాష్ట్రాల్లో 43కి పెరిగిన మృతుల సంఖ్య
గత మూడ్రోజులుగా ఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. దేశ రాజధాని ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో యమునా నది ఉప్పొంగుతోంది. 

దాంతో ఢిల్లీ ప్రభుత్వం వెంటనే స్పందించి, యమునా పరీవాహక ప్రాంతాల్లో నివసించే వేలాది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. వారి కోసం శిబిరాలు ఏర్పాటు చేసి, ఆహారం, తాగునీరు అందించింది. ఢిల్లీ వద్ద సోమవారం సాయంత్రానికి యమునా నది 205.33 మీటర్ల ప్రమాదకర స్థాయికి చేరుకుంది. పాత రైల్వే బ్రిడ్జిని తాకుతూ మహోగ్రంగా ప్రవహిస్తోంది. 

అటు, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లోనూ వర్షబీభత్సం నెలకొంది. హిమాచల్ ప్రదేశ్ లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. 

ఉత్తరాఖండ్ లో వరద ఉద్ధృతికి మరో నలుగురు మరణించారు. మొత్తమ్మీద ఉత్తరాదిన ఇప్పటివరకు భారీ వర్షాలు, వరదల ప్రభావంతో మరణించినవారి సంఖ్య 43కి పెరిగింది. హిమాచల్ ప్రదేశ్ లో ప్రతికూల వాతావరణం కారణంగా చందేర్ తాల్ ప్రాంతంలో 300 మందికి పైగా చిక్కుకుపోయారు. వారిలో అత్యధికులు పర్యాటకులే. ఈ రాత్రికి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే అవకాశాలున్నాయి. 

పలు రాష్ట్రాల్లో వర్షాలు తగ్గడంతో సహాయ చర్యలు ముమ్మరం చేశారు. హర్యానాలోని అంబాలాలో ఓ గురుకుల పాఠశాల నుంచి 730 విద్యార్థినులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. హాస్టల్లోకి వరద నీరు ప్రవేశించడంతో వారిని కురుక్షేత్ర ప్రాంతానికి తరలించారు.
Delhi
Yamuna River
Flood
Heavy Rains
North India
Monsoon

More Telugu News