Ben Stokes: ధోనీ కెప్టెన్సీ రికార్డును బద్దలుగొట్టిన బెన్‌స్టోక్స్

Ben Stokes surpass MS Dhoni record in test captancy
  • మూడో టెస్టులో మూడు వికెట్ల తేడాతో నెగ్గిన ఇంగ్లండ్
  • 250 పరుగులు, అంతకుమించిన టార్గెట్‌ను అత్యధికసార్లు ఛేదించిన కెప్టెన్‌గా బెన్‌స్టోక్స్
  • కివీస్‌పైనే వరుసగా మూడుసార్లు ఛేదన

ఇంగ్లండ్ కెప్టెన్ బెన్‌స్టోక్స్ అత్యంత అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో హెడింగ్లీలో జరిగిన మూడో టెస్టులో మూడు వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 251 పరుగుల లక్ష్యాన్ని మరో మూడు వికెట్లు మిగిలి ఉండగానే ఛేదించింది. ఈ విజయంతో కెప్టెన్ బెన్‌స్టోక్స్ ఓ ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అతడి కెప్టెన్సీలో జట్టు అత్యధికసార్లు 250, అంతకుమించిన టార్గెట్‌ను ఛేదించింది. ఇప్పటి వరకు ఈ రికార్డు టీమిండియా మాజీ సారథి ఎంఎస్ ధోనీ పేరున ఉండగా ఇప్పుడా రికార్డును స్టోక్స్ తుడిచిపెట్టేశాడు. 

స్టోక్స్ సారథ్యంలోని ఇంగ్లిష్ జట్టు గతేడాది న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగిన మూడు టెస్టుల మ్యాచ్‌ల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. వరుసగా 277, 299, 296 పరుగుల టార్గెట్‌ను ఛేదించింది. అలాగే, గతేడాది జులైలో ఎడ్జ్‌బాస్ట్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో 378 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో స్టోక్స్ ఖాతాలోకి ఈ రికార్డు వచ్చి చేరింది. 

స్టోక్స్ సారథ్యంలోని ఇంగ్లండ్ జట్టు 250కిపైగా టార్గెట్‌ను ఐదుసార్లు ఛేదించి ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలవగా, ధోనీ కెప్టెన్సీలో భారత జట్టు 4 సార్లు ఆ ఘనత సాధించింది. బ్రియాన్ లారా, రికీ పాంటింగ్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. యాషెస్ సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి రెండు టెస్టులను ఆస్ట్రేలియా గెలుచుకోగా, మూడో టెస్టును ఇంగ్లండ్ సొంతం చేసుకుంది. నాలుగో టెస్టు  ఈ నెల 19న ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో ప్రారంభమవుతుంది.

  • Loading...

More Telugu News