YV Subba Reddy: నడక మార్గంలో తిరుమల వచ్చే భక్తుల భద్రతకు అధిక ప్రాధాన్యతనిస్తున్నాం: వైవీ సుబ్బారెడ్డి

YV Subbareddy visits Kaushik Nayak who was attacked by a leopard in Alipiri way
  • గత నెలలో అలిపిరి మార్గంలో బాలుడిపై చిరుత దాడి
  • ప్రాణాపాయం తప్పించుకున్న బాలుడు
  • తిరుపతి బర్డ్స్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి
  • బాలుడు బతికాడంటే అది వెంకటేశ్వరస్వామి వల్లేనన్న వైవీ
గత నెల 22న తిరుమల అలిపిరి నడక మార్గంలో కౌశిక్ నాయక్ అనే బాలుడిపై చిరుత దాడి చేయడం తెలిసిందే. గాయాల పాలైన ఆ చిన్నారికి తిరుపతి బర్డ్స్ ఆసుపత్రిలో చికిత్స అందించారు. నాలుగేళ్ల కౌశిక్ నాయక్ ను నిన్న డిశ్చార్జి చేశారు. 

కాగా, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి బాలుడిని పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, చిరుతపులి బారినపడిన పెద్దవాళ్లు బయటపడడమే కష్టం అనుకుంటే, ఈ బాలుడు చిరుత చేత చిక్కి కూడా ప్రాణాపాయం లేకుండా బయటపడడం కేవలం వెంకటేశ్వరస్వామి చలవతోనే అని పేర్కొన్నారు. ఇది బాలుడికి పునర్జన్మ అని వైవీ సుబ్బారెడ్డి అభివర్ణించారు. 

గత జూన్ 22న రాత్రి బాలుడిపై చిరుత దాడి ఘటన జరిగిందని, ప్రస్తుతం బాలుడు అన్ని విధాలా కోలుకున్నాడని తెలిపారు. అదే సమయంలో, చిరుతను కూడా బంధించినట్టు వెల్లడించారు. తిరుమల కొండపైకి నడక మార్గంలో వచ్చే భక్తుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని వైవీ పేర్కొన్నారు. భక్తులపై జంతువులు దాడి చేయకుండా పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.
YV Subba Reddy
Kaushik Nayak
Leopard
Alipiri
Tirumala

More Telugu News