modi warangal tour: భద్రకాళి ఆలయంలో ప్రధాని మోదీ.. ఫొటోలు ఇవిగో!

PM Narendra Modi in warangal Bhadrakhali Temple
  • పూర్ణకుంభంతో స్వాగతం పలికిన అర్చకులు
  • ప్రత్యేక పూజలు నిర్వహించనున్న ప్రధాని
  • పది నిమిషాల పాటు ఆలయంలోనే గడిపిన పీఎం
వరంగల్ లోని భద్రకాళీ ఆలయంలో ప్రధాని నరేంద్ర మోదీకి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు ప్రధాని ఈ రోజు ఉదయం నగరానికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన భద్రకాళీ అమ్మవారిని దర్శించుకున్నారు. మోదీకి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ముందుగా ఆలయ ఆవరణలోని గోశాలలో ప్రధాని మోదీ గో సేవలో పాల్గొన్నారు. అనంతరం లోపలికి వెళ్లి భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

ప్రధాని రాక నేపథ్యంలో అధికారులు ఆలయాన్ని సుందరంగా ముస్తాబు చేశారు. భద్రత దృష్ట్యా భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతించలేదు. చిరుధాన్యాలతో ప్రత్యేకంగా తయారుచేసిన ఆరు రకాల ప్రసాదాలను అర్చకులు ప్రధానికి అందజేశారు. సుమారు పది నిమిషాల పాటు ఆలయంలోనే ఉన్న ప్రధాని.. ఆ తర్వాత ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ మైదానానికి బయలుదేరి వెళ్లారు.

ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో వరంగల్ లో పోలీసులు 144 సెక్షన్ అమలు చేశారు. సుమారు 3,500 మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. తెల్లవారుజాము నుంచే సిటీలో పహారా పెంచారు. హోటళ్లతో సహా అన్ని దుకాణాలు మూసివేయించారు. ప్రధాని పర్యటించే రూట్ లో ట్రాఫిక్ ను మళ్లించిన పోలీసులు ఆ మార్గంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.

ప్రధాని మోదీని స్వాగతించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాకపోవడంపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందిస్తూ.. ప్రధానమంత్రి రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఏ సందర్భంలోనూ సీఎం కేసీఆర్ రాలేదని గుర్తుచేశారు. ఆయనకు ముఖం చెల్లకనే ప్రధానిని కలుసుకోలేదని విమర్శించారు. ప్రధాని టూర్ ను బీఆర్ఎస్ పార్టీ బహిష్కరించినంత మాత్రాన పోయేదేంలేదని కిషన్ రెడ్డి తేల్చిచెప్పారు.ః




   
modi warangal tour
bhadrakhali temple
BJP
modi

More Telugu News