Narendra Modi: హెలికాప్టర్ కాన్వాయ్ తో వరంగల్ చేరుకున్న ప్రధాని మోదీ.. కాసేపట్లో భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు

  • ఉదయం 9.20 గంటలకు హైదరాబాద్ హకీంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న ప్రధాని
  • స్వాగతం పలికిన గవర్నర్, కిషన్ రెడ్డి
  • అక్కడి నుంచి ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ లో వరంగల్ కు పయనం
Modi reached Warangal from Hyderabad

ప్రధాని నరేంద్ర మోదీ వరంగల్ కు చేరుకున్నారు. ఉదయం 9.20 గంటలకు ఆయన ఢిల్లీ నుంచి హైదరాబాద్ లోని హకీంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. షెడ్యూల్ టైమ్ కంటే 10 నిమిషాల ముందే ఆయన హైదరాబాద్ లో ల్యాండ్ కావడం గమనార్హం. ఎయిర్ పోర్టులో ప్రధానికి గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలు స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా వరంగల్ కు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ లో బయల్దేరారు. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ను మరో రెండు హెలికాప్టర్లు అనుసరించాయి. కాసేపటి క్రితం ఆయన వరంగల్ మామునూరులోని ఎయిర్ స్ట్రిప్ లో ల్యాండ్ అయ్యారు. 

వరంగల్ లో తొలుత ఆయన భద్రకాళి అమ్మవారిని దర్శించుకుంటారు. అనంతరం వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీకి చేరుకుంటారు. అక్కడ రూ. 6,100 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన చేస్తారు. వీటిలో కాజీపేటలో నిర్మించనున్న వ్యాగన్ తయారీ పరిశ్రమ, వరంగల్ - మంచిర్యాల జాతీయ రహదారి విస్తరణ పనులు, జగిత్యాల - కరీంనగర్ - వరంగల్ ఇంటర్ కారిడార్ పనులు ఉన్నాయి. అనంతరం అక్కడ జరిగే బహిరంగ సభలో మోదీ పాల్గొంటారు వేదికపై మోదీతో పాటు గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, కిషన్ రెడ్డి, సీఎం కేసీఆర్ సహా 8 మంది మాత్రమే కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. మరోవైపు మోదీ పర్యటనకు ముఖ్యమంత్రి కేసీఆర్ దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.

More Telugu News