Tulasi Reddy: జీవో 31ని వెంటనే ఉపసంహరించుకోవాలి: తులసిరెడ్డి

  • వాహనాల త్రైమాసిక పన్నును మళ్లీ 25 శాతం పెంచడం దారుణమన్న తులసిరెడ్డి
  • పన్ను ఇప్పటికే పొరుగు రాష్ట్రాల కంటే 30 శాతం ఎక్కువగా ఉందని విమర్శ
  • పెట్రోల్, డీజిల్ ధరలు కూడా ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువగా ఉన్నాయని మండిపాటు
Tulasi Reddy demands to withdraw GO 31

వాహనాల త్రైమాసిక పన్నును ఏపీ ప్రభుత్వం మళ్లీ 25 శాతం పెంచడం దారుణమని కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి అన్నారు. త్రైమాసిక పన్ను ఇప్పటికే పొరుగు రాష్ట్రాల కంటే ఏపీలో 30 శాతం ఎక్కువగా ఉందని చెప్పారు. గోరుచుట్టుపై రోకటి పోటులా ఇప్పుడు పన్నును మరో 25 శాతం పెంచుతూ జీవో 31ని విడుదల చేయడం దారుణమని అన్నారు. ఈ కొత్త జీవో వల్ల 10 టైర్ల లారీ త్రైమాసిక పన్ను గతంలో రూ. 6,600గా ఉండగా... ఇప్పుడు రూ. 8,410కి పెరిగిందని చెప్పారు. 

జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలు కూడా ఇతర రాష్ట్రాల కంటే ఏపీలోనే ఎక్కువ ఉన్నాయని విమర్శించారు. గ్రీన్ ట్యాక్స్ ను కూడా రూ. 200 నుంచి రూ. 20 వేలకు పెంచారని మండిపడ్డారు. రోడ్లు అధ్వానంగా ఉండటం వల్ల వాహనాలు దెబ్బతింటున్నాయని, పెరిగిపోయిన టైర్లు, స్పేర్ పార్టుల ధరల కారణంగా వాహనదారులకు భారం పెరిగిపోయిందని చెప్పారు.

More Telugu News