rbi: డెబిట్, క్రెడిట్ కార్డుల విషయంలో ఇక మీకు ఇష్టమైన పేమెంట్ నెట్ వర్క్ ను ఎంచుకోవచ్చు!

  • నచ్చిన కార్డు నెట్ వర్క్ కు మారడానికి ఆర్బీఐ వెసులుబాటు
  • డ్రాఫ్ట్ ను సిద్ధం చేసి, అభిప్రాయాలు కోరుతున్న ఆర్బీఐ
  • అక్టోబర్ 1, 2023 నుండి అందుబాటులోకి
RBI To Allow Customers To Choose Card Networks

డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, ప్రీపెయిడ్ కార్డుల విషయంలో కస్టమర్ తనకు నచ్చిన పేమెంట్ నెట్ వర్క్ ను ఎంచుకునే వెసులుబాటు అందుబాటులోకి రానుంది. మాస్టర్ కార్డు నుండి రూపే, రూపే కార్డు నుండి మాస్టర్ కు... ఇలా నచ్చిన కార్డు నెట్ వర్క్ కు మారడానికి ఆర్బీఐ వెసులుబాటు కల్పించే దిశగా అడుగులు వేసింది. ఇందుకు సంబంధించి డ్రాఫ్ట్ ను సిద్ధం చేసింది. ఈ సౌకర్యాన్ని అక్టోబర్ 1, 2023 నుండి అందుబాటులోకి తీసుకురావాలని కార్డు జారీదారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇది అమల్లోకి వస్తే వీసా, మాస్టర్ కార్డ్, రూపే, అమెరికన్ ఎక్స్‌ప్రెస్.. తదితర కార్డులలో కస్టమర్ తనకు నచ్చిన కార్డు నెట్ వర్క్ ను ఎంచుకోవచ్చు.

కార్డు జారీ సంస్థలు ఇప్పటి వరకు బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంటున్నాయి. దీని ప్రకారం కస్టమర్ ఏ కార్డును వినియోగించాలన్నది సదరు కార్డు జారీ సంస్థదే నిర్ణయం. కానీ అక్టోబర్ నుండి ఇది కస్టమర్ ఛాయిస్ కానుంది. ఒక కార్డు ఉన్న వారు మరో కార్డుకు మారవచ్చు. ప్రస్తుతం డ్రాఫ్ట్ పై ఆర్బీఐ అభిప్రాయాలు కోరుతోంది. 

డ్రాఫ్ట్ ప్రకారం కార్డు జారీ చేసే వారు ఆయా సంస్థలతో ముందస్తు ఒప్పందాలు చేసుకొని, కస్టమర్లు ఇతర నెట్ వర్క్ సేవలను పొందకుండా నిరోధించవద్దు. కార్డు జారీ చేసే సంస్థ ఒకటి కంటే ఎక్కువ ఫైనాన్షియల్ నెట్ వర్క్ లతో సంబంధాలు పెట్టుకోవాలి. వాటికి సంబంధించిన కార్డులు జారీ చేయాలి. అర్హులైన కస్టమర్లకు కార్డును ఎంచుకునే వెసులుబాటును కల్పించాలి. ఎప్పుడైనా మరో కార్డుకు మారే అవకాశం ఇవ్వాలి.

More Telugu News