Telangana: భట్టి విక్రమార్కకు కీలక ‘టాస్క్’ ఇచ్చిన రాహుల్ గాంధీ!

Rahul Gandhi gives a key task to Bhatti Vikramarka
  • కర్ణాటక ఎన్నికల్లో విజయం తర్వాత తెలంగాణపై ఫోకస్ పెట్టిన రాహుల్
  • ముందుగానే అభ్యర్థులను ప్రకటించాలని నిర్ణయానికి వచ్చిన అధిష్ఠానం
  • సర్వేలతో పాటు ఈ విషయంలో భట్టి నుంచి నివేదిక కోరిన రాహుల్!
కర్ణాటక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత కాంగ్రెస్ జాతీయ నాయకత్వం తెలంగాణపై ఫోకస్ పెట్టింది. రాష్ట్ర నాయకత్వ మార్పులతో బీజేపీలో ఏర్పడిన శూన్యతను సద్వినియోగం చేసుకోవాలని అనుకుంటోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేరుగా రంగంలోకి దిగి రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఖమ్మంలో జరిగిన జనగర్జన, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ ముగింపు సభకు హాజరైన రాహుల్ గాంధీ.. బీజేపీ, బీఆర్ఎస్ ను టార్గెట్ చేసి ఘాటైన విమర్శలు చేశారు. ఈ క్రమంలో పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ద్వారా రాష్ట్రంలో పార్టీ జోష్ కి కారణమైన భట్టికి రాహుల్ కీలక బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. ఖమ్మం సభ తరువాత కారులో గన్నవరం బయల్దేరిన రాహుల్ తనతో పాటుగా భట్టిని వెంటబెట్టుకెళ్లారు.

ఆ సమయంలో రాష్ట్రంలో పార్టీలోని పరిస్థితులపై ఆరా తీయడంతో పాటు నేతల సమన్వయంపైన చర్చించారు. ఎన్నికల మేనిఫెస్టో, అభ్యర్థుల ఎంపిక కీలకం కావటంతో వీటిపైన భట్టి అభిప్రాయాలను రాహుల్ కోరినట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. చివరి నిమిషంలో టికెట్లు ఖరారు చేయటం వలన గత రెండు ఎన్నికల్లో పార్టీ దెబ్బతింది. దీంతో ఈసారి ముందుగానే అభ్యర్థులను ఖరారు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం సర్వేలతో పాటు పాదయాత్ర ద్వారా భట్టి తెలుసుకున్న విషయాలను క్రోడీకరించి భట్టి ఇచ్చే నివేదిక ద్వారా రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో భట్టి పాదయాత్రలో లభించిన ఫీడ్ బ్యాక్ ను తీసుకుంటానని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా ఇది వరకే ప్రకటించారు.
Telangana
Rahul Gandhi
Congress
Mallu Bhatti Vikramarka
Telangana Assembly Election

More Telugu News