Coco Lee: పాప్యులర్ సింగర్, నటి కోకో లీ ఆత్మహత్య

singer and actor Coco Lee dies by suicide
  • గత కొన్నేళ్లుగా డిప్రెషన్‌తో బాధపడుతున్న లీ
  • చికిత్స తీసుకుంటున్నప్పటికీ ఫలితం శూన్యం
  • కోమాలోకి వెళ్లి చికిత్స పొందుతూ మృతి
హాంకాంగ్‌కు చెందిన ప్రముఖ గాయకురాలు, పాటల రచయిత, నటి కోకో లీ ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె వయసు 48 సంవత్సరాలు. ఈ విషయాన్ని లీ తోబుట్టువులు కరోల్, నాన్సీ సోషల్ మీడియా పోస్టు ద్వారా వెల్లడించారు. లీ గత కొన్నేళ్లుగా తీవ్రమైన వ్యాకులత (డిప్రెషన్)తో బాధపడుతోందని, ఇటీవల పరిస్థితి మరింత దిగజారినట్టు పేర్కొన్నారు. దీని నుంచి బయటపడేందుకు విపరీతంగా పోరాడినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఈ నెల 2న లీ ఇంట్లోనే ఆత్మహత్యకు యత్నించింది. అపస్మారకస్థితిలోకి చేరుకున్న ఆమెను గుర్తించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందిస్తుండగానే కోమాలోకి చేరుకుంది. చివరికి 5న ఆమె తుదిశ్వాస విడిచింది. 

హాంకాంగ్‌లో జన్మించిన లీ శాన్‌ఫ్రాన్సిస్కోలో పెరిగింది. ఆ తర్వాత పాప్ సింగర్‌గా కెరియర్‌ను ప్రారంభించింది. తన 30 ఏళ్ల కెరియర్‌లో ఆల్బమ్స్‌ విడుదల చేసింది. 1996లో సోనీ మ్యూజిక్‌తో ఒప్పందం కుదుర్చుకుని ఆ ఘనత అందుకున్న తొలి చైనీస్ అమెరికన్‌గా రికార్డుకెక్కింది. 1998లో ఆమె విడుదల చేసిన మాండరిన్ ఆల్బం డి డా డి మూడు నెలల్లోనే మిలియన్ కాపీలకుపైగా అమ్ముడుపోయాయి. 

‘హిడెన్‌ డ్రాగన్‌’లోని ‘ఎ లవ్‌ బిఫోర్‌ టైమ్‌’ సాంగ్‌ 2001లో ఉత్తమ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరిలో ఆస్కార్‌కు నామిట్‌ అయింది. అవార్డుల ప్రదానోత్సవంలో ప్రదర్శన ఇచ్చిన తొలి చైనీస్ అమెరికన్ గానూ ఆమె రికార్డులకెక్కింది. అంతలోనే ఆమె ఆత్మహత్య విషాదాన్ని నింపింది.
Coco Lee
Hongkong
China

More Telugu News