Sajjanar: అతిప్రేమతో పిల్లలకు వాహనాలు ఇస్తే ఇలాంటి ప్రమాదాలే జరుగుతాయి: సజ్జనార్

TSRTC MD sajjanar responds to death of mother daughter duo in road accident in Suncity
  • నగర శివారులో కారు ఢీకొని తల్లీకూతుళ్ల మరణంపై సజ్జనార్ ట్వీట్
  • యువకుడి నిర్లక్ష్యం, మితిమీరిన వేగం తల్లీకూతుళ్లను బలిగొందని విచారం
  • పిల్లలపై అతిప్రేమతో వాహనాలు ఇస్తే ఇలాంటి దుర్ఘటన జరుగుతుందని వ్యాఖ్య

హైదరాబాద్ నగర శివారులో నిన్న వాకింగ్ కోసం బయటకు వచ్చిన తల్లీకూతుళ్లు కారుకింద పడి మరణించడంపై టీఎస్ఆర్‌టీసీ ఎండీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఇది చాలా దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ‘‘ఓ యువకుడి నిర్లక్ష్యం, మితిమీరిన వేగం మార్నింగ్ వాకింగ్‌కు వెళ్లిన అమాయకులైన తల్లీకూతురిని పొట్టనపెట్టుకుంది. మరో ఇద్దరిని గాయాలపాలు చేసింది. పిల్లలకు తల్లిదండ్రులు వాహనాలు ఇచ్చేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. పిల్లల మీద అతిప్రేమతో వాహనాలిచ్చి రోడ్లపైకి పంపితే ఇలాంటి దుర్ఘటనలే జరుగుతాయి’’ అని సజ్జనార్ ట్వీట్ చేశారు. 

హైదర్‌షాకోట్‌లోని లక్ష్మీ నరసింహ కాలనీలో నివసించే నెమలి అనురాధ(48), ఆమె కుమార్తె(26) మంగళవారం ఉదయం 6 గంటలకు వాకింగ్‌ కోసం ఇంటినుంచి బయటకు వచ్చారు. సమీప కాలనీకి చెందిన కవిత(36)తో కలిసి వారు బండ్లగూడ జాగీర్ సన్‌సిటీ వాగింగ్ చేస్తుండగా మలుపు వద్ద ఓ అదుపు తప్పిన కారు వేగంగా వచ్చి వారిని వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో, ముగ్గురూ 10 మీటర్ల దూరం ఎగిరిపడ్డారు. వారికీ సమీపంలోనే నడుస్తూ వెళుతున్న ఇంతియాజ్ ఆలం ఖాన్‌ను కూడా కారు ఢీకొట్టింది. ఈ ఘటనతో తల్లీకూతుళ్లు అక్కడికక్కడే మృతిచెందారు. కవిత, ఆలంఖాన్ తీవ్రంగా గాయపడ్డారు. వారు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

  • Loading...

More Telugu News