ucc: ఉమ్మడి పౌర స్మృతిపై బీజేపీకి మిత్రపక్షం షాక్, మిజోరాం సీఎం కీలక వ్యాఖ్యలు

  • యూసీసీ మిజోల ప్రయోజనాలకు విరుద్ధమని వ్యాఖ్య
  • ఎన్డీయే విధానాలు ప్రజలకు, మైనార్టీలకు ప్రయోజనం ఉన్నంత వరకే మద్దతిస్తామని వెల్లడి
  • ఇదివరకే విభేదించిన మేఘాలయ సీఎం కాన్రాడ్
UCC is against interest of ethnic minorities says Mizoram CM

ఉమ్మడి పౌర స్మృతిపై (యూసీసీ) కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి షాక్! ఒకటి రెండు ఎన్డీయే పక్షాలు ఉమ్మడి పౌర స్మృతికి నో చెబుతున్నాయి. మిజోరాం ముఖ్యమంత్రి, మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్ఎఫ్) ప్రెసిడెంట్ జోరామ్‌తంగ మాట్లాడుతూ.. యూసీసీ అల్పసంఖ్యాక వర్గాలకు వ్యతిరేకమని, ముఖ్యంగా మిజోల ప్రయోజనాలకు విరుద్ధమన్నారు. ఈ మేరకు మంగళవారం భారత లా కమిషన్ కు లేఖ రాశారు. యూసీసీ మిజోల మతపరమైన, సామాజిక అంశాలకు, రాజ్యాంగంలోని ఆర్టికల్ 371(జీ) ద్వారా రక్షించబడిన మిజోల ఆచారాలకు విరుద్ధంగా ఉందని తమ పార్టీ విశ్వసిస్తోందన్నారు.

మరో మిత్రపక్ష నేత, మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా కూడా యూసీసీపై విభేదించారు. యూసీసీ భారత ప్రస్తుత ఆలోచనలకు విరుద్ధమని ఇటీవల వ్యాఖ్యానించారు. సంగ్మా మాట్లాడిన కొన్నిరోజులకే జోరామ్‌తంగ కూడా అదేవిధంగా మాట్లాడటం గమనార్హం. యూసీసీని అంగీకరించలేమని లా కమిషన్ కు రాసిన లేఖలో జోరామ్‌తంగ పేర్కొన్నారు. ఎన్డీయే ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాలు ప్రజలకు, దేశంలోని మైనార్టీలకు ప్రయోజనకరంగా ఉన్నంత వరకు తాము మద్దతిస్తామన్నారు. కాగా యూసీసీపై అభిప్రాయాలు చెప్పాల్సిందిగా లా కమిషన్ ఇటీవల పబ్లిక్ నోటీసును జారీ చేసింది.

More Telugu News