Gudivada Amarnath: వయసు పెరిగేకొద్దీ మీలో అశ్లీలత పెరుగుతోంది... హరిరామజోగయ్యకు మంత్రి అమర్నాథ్ కౌంటర్

Gudivada Amarnath replies to Harirama Jogaiah remarks on CM Jagan
  • సీఎం జగన్ కు లేఖ రాసిన హరిరామజోగయ్య
  • మీ తండ్రి హుందాతనంలో మీకు పది శాతం కూడా లేదని విమర్శలు
  • పవన్ ఎన్ని పెళ్లిళ్లు చేసుకుంటే మీకెందుకు బాధ అంటూ ప్రశ్నించిన వైనం
  • పవన్ సాంగత్యంలో మీలో అశ్లీలత పెరుగుతోందన్న అమర్నాథ్ 
  • స్వాతిచౌదరితో పోటీపడాలనుకుంటున్నారా అంటూ సెటైర్
జనసేనాని పవన్ కల్యాణ్ పై ఇటీవల సీఎం జగన్ తీవ్రస్థాయిలో విమర్శలు చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, సీఎం జగన్ ను ఘాటుగా విమర్శిస్తూ కాపు ఉద్యమ నేత హరిరామజోగయ్య లేఖాస్త్రం సంధించారు. పవన్ ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్నా, ప్రజలకు లేని బాధ మీకెందుకని జగన్ ను ప్రశ్నించారు. కేసీఆర్ దత్తపుత్రుడిగా మీరు తీసుకున్నది ప్యాకేజీ కాదా? అని నిలదీశారు. మీ నాన్న వైఎస్ కు ఉన్న హుందాతనంలో 10 శాతం కూడా మీకు లేదు అంటూ విమర్శించారు. 

హరిరామజోగయ్య లేఖపై ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. వయసు పెరిగే కొద్దీ మీలో అశ్లీలత పెరుగుతోంది అని విమర్శించారు. ఎవరికైనా వయసు పైబడే కొద్దీ సభ్యత సంస్కారం పెరుగుతుంటాయి... కానీ పవన్ తో సాంగత్యం వల్ల మీకు అశ్లీలత ఎక్కువ అవుతోందని వ్యాఖ్యానించారు. చూస్తుంటే స్వాతిరెడ్డి అలియాస్ స్వాతి చౌదరితో పోటీ పడాలని మీరు నిర్ణయించుకున్నట్టుగా కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. 

చంద్రబాబు దత్తపుత్రుడైన పవన్ కల్యాణ్ పై మీకున్నది ధృతరాష్ట్ర  ప్రేమ... దాని వల్ల ప్రయోజనం ఏంటి? అని ప్రశ్నించారు. పవన్ తో సినిమాలు తీసే నిర్మాతలంతా చంద్రబాబు మనుషులే, అసలు, పవన్ కల్యాణ్ పుట్టిందే చంద్రబాబు కోసం, పవన్ పెరుగుతున్నదే ఎల్లో మీడియాలో అని అమర్నాథ్ పేర్కొన్నారు. 

మీరు కూడా ఓ ప్యాకేజి స్టార్ కావాలనుకుంటున్నారా? వ్యాఖ్యలు చేసే ముందు, లేఖలు రాసే ముందు విచక్షణతో వ్యవహరించాలని కోరుతున్నా అని హితవు పలికారు. ఎంతో గొప్ప రాజకీయ జీవితం గడిపిన మీరు ఈ దశలో ఇలా దిగజారిపోయి లేఖలు రాయడం బాగాలేదు అని మంత్రి అమర్నాథ్ వ్యాఖ్యానించారు.
Gudivada Amarnath
Harirama Jogaiah
Jagan
Pawan Kalyan
Chandrababu
YSRCP
Janasena
TDP

More Telugu News