Guntur District: '11 వేలు కడితే 4 నెలల్లో 64 వేల ఆదాయం' అంటూ గుంటూరులో ఘరానా మోసం

  • రూ. లక్ష పెట్టుబడికి ఏడాదిలో 13.94 లక్షలు ఇస్తామంటూ వల
  • ప్రజలను బురిడీ కొట్టించిన పాట్నా గ్రీన్ ఎనర్జీ కంపెనీ ప్రతినిధి
  • ఆన్ లైన్ వ్యాపారం పేరుతో లక్షల్లో నష్టపోయిన బాధితులు
Patna green energy company cheating busted in guntur district

ఆన్ లైన్ వ్యాపారం పేరుతో గుంటూరు జిల్లాలో మరో మోసం వెలుగుచూసింది. వందల్లో పెట్టుబడి పెడితే వేలల్లో ఆదాయం.. వేలల్లో పెట్టుబడి పెడితే లక్షల్లో ఆదాయమంటూ ఊరించి ప్రజలను నిలువునా దోచుకున్నారు. కంపెనీ ప్రతినిధినంటూ ఓ వ్యక్తి చేసిన మోసానికి జనం లక్షల్లో నష్టపోయారు. పాట్నా గ్రీన్ ఎనర్జీ కంపెనీ ఏజెంట్ నంటూ శ్రీకాకుళానికి చెందిన జనార్దన్ ఆన్ లైన్ లో గుంటూరు జిల్లాకు చెందిన కొంతమందితో పరిచయం పెంచుకున్నాడు. తమ కంపెనీలో పెట్టుబడి పెడితే పెద్ద మొత్తంలో ఆదాయం పొందొచ్చని నమ్మబలికాడు. రూ.11 వేలు కడితే నాలుగు నెలల్లో రూ.64 వేలు ఇస్తామని, రూ.లక్ష కడితే ఏడాది తిరిగేసరికి రూ.13.94 లక్షలు సంపాదించుకోవచ్చని ఊరించాడు.

జనార్దన్ మాయమాటలు నమ్మి చాలామంది పాట్నా గ్రీన్ ఎనర్జీ (పీజీఈ) కంపెనీలో పెట్టుబడి పెట్టారు. వాట్సాప్ లో పంపిన లింక్ తో గుంటూరుకు చెందిన అరుణకుమారి, పల్నాడు జిల్లా బెల్లంకొండకు చెందిన యాసిన్, నవీన్.. తదితరులు లక్షల్లో పెట్టుబడి పెట్టారు. గడువు పూర్తవడంతో డబ్బులు తిరిగివ్వాలని కోరగా.. వారిని బ్లాక్ లిస్ట్ లో పెట్టాడు. కొన్నాళ్ల తర్వాత ఆన్ లైన్ దుకాణం మూసేశాడు. దీంతో మోసపోయామంటూ బాధితులు స్పందన కార్యక్రమంలో గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. నిందితుడిని అరెస్ట్‌ చేసి, తమ డబ్బులు తమకు ఇప్పించాలని ఎస్పీని వేడుకున్నారు.

More Telugu News