Telangana: అల్లూరి అమరత్వం అజరామరం: సీఎం కేసీఆర్

CM KCR all praises Alluri sitaramaraju
  • దేశ స్వాతంత్య్రం, స్వయం పాలన కోసం అల్లూరి చేసిన త్యాగం గొప్పదని కితాబు
  • నేడు హైదరాబాద్ లో సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమం
  • హాజరుకానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమం ఈ రోజు హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరగనుంది. సాయంత్రం జరిగే కార్యక్రమానికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ కూడా పాల్గొననున్నారు. ఈ సందర్భంగా దేశం కోసం అల్లూరి చేసిన త్యాగాన్ని సీఎం కేసీఆర్‌ స్మరించుకొన్నారు.  దేశ స్వాతంత్య్రం కోసం, స్వయం పాలన కోసం తన ప్రాణాలను పణంగా పెట్టి బ్రిటిష్‌ పాలకులతో పోరాడిన అల్లూరి సీతారామరాజు త్యాగం గొప్పదని, స్వాతంత్య్రోద్యమ చరిత్రలో వారి అమరత్వం అజరామరమని పేర్కొన్నారు. 

గిరిజనుల హకుల సాధన కోసం నాటి బ్రిటిష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అల్లూరి ప్రదర్శించిన అసమాన ధైర్యసాహసాలు, పోరాట స్ఫూర్తి చిరస్మరణీయమని చెప్పారు. సీతారామరాజు వంటి వీరుల స్ఫూర్తితో ఎందరో దేశ పౌరులు నాటి స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నారని తెలిపారు. భారత రాష్ట్రపతి పాల్గొంటున్న, చారిత్రక సందర్భమైన అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమాన్ని తెలంగాణ గడ్డమీద హైదరాబాద్‌లో నిర్వహించుకోవడం గొప్ప విషయమని పేర్కొన్నారు. ప్రజల కోసం పోరాడే త్యాగధనుల జీవితాలు విశ్వజనీనమైన స్ఫూర్తిని పంచుతాయన్నారు. అల్లూరి త్యాగాలను స్మరించుకొంటూ రేపటి తరాలు ముందుకు సాగాలని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు. 

  • Loading...

More Telugu News