China: పిల్లల్ని కంటే ఐదేళ్లలో రూ.5 లక్షలు... తొలిసారి ప్రయివేటు కంపెనీ బంపరాఫర్

  • ఉద్యోగులకు చైనా అతిపెద్ద ఆన్‌లైన్ ట్రావెల్ ఏజెన్సీ ట్రిప్ డాట్ కామ్ ఆఫర్
  • ఎక్కువమంది పిల్లల్ని కనేలా ప్రోత్సహించేందుకు సరికొత్త పథకం
  • ఏడాదికి 11,000 యువాన్లు
This Chinese company will pay employees Rs 56 lakh to have children

చైనా అతిపెద్ద ఆన్‌లైన్ ట్రావెల్ ఏజెన్సీ ట్రిప్ డాట్ కామ్ తమ ఉద్యోగులకు బంపరాఫర్ ఇచ్చింది. చైనాలో యువత జనాభా తగ్గి, వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. దీంతో చైనా ఆందోళన చెందుతోంది. ఈ క్రమంలో పిల్లల్ని కనాలని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. 

తాజాగా ట్రిప్ డాట్ కామ్ కూడా ఉద్యోగులకు అదిరిపోయే వార్త చెప్పింది. తమ ఉద్యోగులు ఎక్కువ మంది పిల్లలను కలిగి ఉండేలా ప్రోత్సహించడానికి కొత్తగా పిల్లల సంరక్షణ రాయితీలను ప్రకటించింది.

కంపెనీలో పని చేసే ఉద్యోగులు పిల్లల్ని కంటే ఒక్కో శిశువుకు ఏడాదికి 11,000 యువాన్ల చొప్పున వార్షిక బోనస్ గా అయిదేళ్లపాటు అందిస్తామని తెలిపింది. ఇది భారత కరెన్సీలో దాదాపు రూ.1.1 లక్షలు. ఆ లెక్కన ఒక శిశువుకు ఐదేళ్లలో రూ.5.6 లక్షలు లభిస్తాయి. 

ఈ ఆఫర్ ను జూన్ 30న ప్రకటించగా, జూలై 1 నుండి అమల్లోకి వచ్చింది. ట్రిప్ డాట్ కామ్ లో మూడేళ్లు అంతకంటే ఎక్కువ కాలంగా పని చేస్తున్న ఉద్యోగులకు ఈ కొత్త చైల్డ్ కేర్ బెనిఫిట్ ప్రయోజనం అందుతుంది.

తమ ఉద్యోగులు వారి వృత్తిపరమైన లక్ష్యాలు, సాధనలపై రాజీపడకుండా వారి కుటుంబాలను పోషించుకునేలా ప్రోత్సహిస్తూ ఆర్థిక సహాయాన్ని అందించే లక్ష్యంగా ఈ చైల్డ్ కేర్ బెనిఫిట్ ను ప్రవేశపెట్టామని కంపెనీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జేమ్స్ లియాంగ్ తెలిపారు. 

ఈ కార్యక్రమానికి కంపెనీకి దాదాపు 1 బిలియన్ యువాన్లు ఖర్చవుతుందని అంచనాలు ఉన్నాయి. చైనాలో ఓ ప్రయివేటు కంపెనీ ఈ తరహా ఆఫర్ ఇవ్వడం ఇదే మొదటిసారి. చైనాలో జననాల రేటు గత ఏడాది 1,000 మందికి 6.77కు పడిపోగా, 2021లో 7.52 జననాలుగా ఉంది.

More Telugu News