Varla Ramaiah: చంద్రబాబు నివాసం జప్తు చేశారంటూ సజ్జల శునకానందం ప్రదర్శించారు: వర్ల రామయ్య

Varla Ramaiah slams YCP leaders over Lingamaneni guest house issue
  • కరకట్టపై ఉన్న లింగమనేని గెస్ట్ హౌస్ జప్తుకు కోర్టు ఆదేశాలు
  • జగన్ టీమ్ పైశాచిక ఆనందం పొందుతోందన్న వర్ల రామయ్య
  • రాష్ట్రంలో చంద్రబాబుకు ఇల్లు లేకుండా చేస్తారా అంటూ ఆగ్రహం
ముఖ్యమంత్రి జగన్ టీమ్ ప్రతిపక్షాలను ఇబ్బందిపెట్టి పైశాచిక ఆనందం పొందుతోందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడూతూ... వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు వీధి రౌడీల్లా వ్యవహరిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారని విమర్శించారు. 

"నిన్న చంద్రబాబు నివాసం ఉంటున్న కరకట్ట ఇంటిని జప్తు చేశారంటూ అతి అల్పబుద్ధి కలిగిన సజ్జల రామకృష్ణారెడ్డి పాత్రికేయులతో మాట్లాడుతూ వ్యక్తపరిచిన శునకానందం ఆశ్చర్యాన్ని కలిగించింది. రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు, ప్రతిపక్షం ఉండకూడదని ముఖ్యమంత్రి జగన్ ఉద్దేశ్యమా? అడుగడుగునా ప్రతిపక్షనేత చంద్రబాబు కదలికలకు అడ్డంకులు కలిగిస్తుంది అందుకేనా? 

ఆయన అద్దెకు ఉంటున్న నివాసం జప్తు చేస్తే ఆ తగవు ఇంటి యాజమాని లింగమనేని రమేశ్ కి ప్రభుత్వానికి సంబంధించినది అవుతుంది. అందులోకి చంద్రబాబు నాయుడుని ఎందుకు లాగుతున్నారు? చంద్రబాబు కుప్పంలో నూతన గృహ నిర్మాణానికి అనుమతి ఇవ్వకుండా ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఆయన ఇల్లు కట్టుకోవడం జగన్ కు ఇష్టం లేదా? 

తాడేపల్లిలో జగన్ రెడ్డి ఇల్లు కట్టుకోవాలంటే ఆనాడు ముఖ్యమంత్రి ఆగమేఘాల మీద అనుమతులు ఇచ్చారే, మరి, అదే విధంగా మీరెందుకు చంద్రబాబుకు అనుమతులివ్వరు? ప్రతిపక్ష నాయకుడైన చంద్రబాబుపై ముఖ్యమంత్రికి ఎందుకు అంత కక్ష? 

చంద్రబాబు ఇంటిపైన దాడికి, వీధి రౌడీలా వ్యవహరించిన జోగి రమేశ్ కు ప్రమోషన్ ఇచ్చి మంత్రిని చేస్తారా? పార్టీ ప్రధాన కార్యాలయం మీద దాడి చేసిన చిరు నాయకుడ్ని పెద్ద నాయకుడుగా ప్రమోషన్ ఇస్తారా? బాధిత మాదిగ కుటుంబాలను పలకరించటానికి ఆత్మకూరు వెళ్తున్న చంద్రబాబును ఇంటిలోనుండి బయటికి రాకుండా గేటుకు ఎందుకు తాళ్లు కట్టి నిర్బంధించారు?
 
అడుగడుగునా చంద్రబాబు పర్యటనలకు అడ్డుతగిలి, చిల్లర కేసులు పెట్టి ఆటంకం కలిగిస్తారా? చిమ్మ చీకటిలో అనపర్తిలో 8 కిలోమీటర్లు ఆయన్ని ఇబ్బంది పెట్టాలని కాలి నడకన నడిపిస్తారా? లింగమనేని రమేశ్ కట్టిన ఈ ఇంటికి ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి అన్ని అనుమతులు ఇచ్చారని ఈ నాటి ముఖ్యమంత్రికి తెలుసా? ప్రతిపక్ష నాయకుడుగా జగన్ అధికార నివాసంగా లోటస్ పాండ్ లోని ఇంటికి అనుమతి ఇచ్చింది నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడని మీకు తెలియదా?

 మరి ఈనాడు మీరు ముఖ్యమంత్రిగా ఉంటూ ప్రతిపక్ష నాయకుడైన చంద్రబాబుకు ఎందుకు అనుమతులు ఇవ్వరు? చంద్రబాబుకు ఇల్లు లేకుండా చేసి, కట్టుకోవడానికి అనుమతులు ఇవ్వకుండా ఆయనను రోడ్డున పడేద్దామనుకుంటున్నారా?

 మీరెన్ని కుట్రలు పన్నినా, ఆయనకు ఇల్లు లేకుండా ఎన్ని ఆటంకాలు సృష్టించినా, ప్రస్తుతం ఉంటున్న ఇంటి నుండి బయటికి పంపినా, ఆయన కోట్లాది మంది ప్రజల గుండెల్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఈ విషయాన్ని వైసీపీ నేతలు గమనించాలి" అంటూ వర్ల రామయ్య పేర్కొన్నారు.
Varla Ramaiah
Sajjala Ramakrishna Reddy
Lingamaneni Guest House
Chandrababu
Jagan

More Telugu News