Bhadradri Kothagudem District: పొంగులేటి ఎఫెక్ట్, బీఆర్ఎస్‌కు భద్రాద్రి జెడ్పీ చైర్మన్ సహా 82 మంది ప్రజాప్రతినిధుల రాజీనామా

  • ఇల్లందు నియోజకవర్గంలో ఐదు మండలాల పరిధిలోని ప్రజాప్రతినిధుల రాజీనామా
  • జులై 2న ఖమ్మంలో జరిగే సభలో కాంగ్రెస్ లో చేరుతామని వెల్లడి
  • పొంగులేటి వర్గీయులుగా ఉంటున్న జెడ్పీ చైర్మన్ కనకయ్య, ఇతర ప్రజాప్రతినిధులు
Shock to BRS in Bhadradri Kothagudem district

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బీఆర్ఎస్ కు భారీ షాక్ తగిలింది. భద్రాద్రి జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. కనకయ్యతో పాటు పలువురు అనుచరులు కూడా పార్టీకి గుడ్ బై చెప్పారు. అలాగే ఇల్లందు నియోజకవర్గం ఐదు మండలాల పరిధిలో ఒక జెడ్పీటీసీ, 56 మంది సర్పంచ్‌లు, 26 మంది ఎంపీటీసీలు రాజీనామా చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ, తాము మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు కాంగ్రెస్ లో చేరనున్నట్లు తెలిపారు. జులై 2న ఖమ్మంలో జరిగే మల్లు భట్టి సభలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు చెప్పారు.

కోరం కనకయ్య కొంతకాలంగా మాజీ ఎంపీ పొంగులేటితో సన్నిహితంగా ఉంటున్నారు. దీనిపై స్థానిక బీఆర్ఎస్ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన బీఆర్ఎస్ కు రాజీనామా చేసి, కాంగ్రెస్ లో చేరనున్నట్లు ప్రకటించారు. ఆయన జెడ్పీ చైర్మన్ పదవికి కూడా రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అయితే తన రాజీనామా కోరడం సరికాదని, అవిశ్వాసం పెట్టాలని కోరం కనకయ్య సవాల్ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఆయన పార్టీకి మాత్రమే రాజీనామా చేశారు.

More Telugu News