Kotamreddy Sridhar Reddy: నెల్లూరు జిల్లాలో 10కి 10 సీట్లు టీడీపీవే.. లోకేశ్ పాదయాత్ర ఒక ప్రభంజనం: కోటంరెడ్డి

TDP will win all seats in Nellore District says Kotamreddy Sridhar Reddy
  • రేపు 2.30 గంటలకు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోకి లోకేశ్ పాదయాత్ర ప్రవేశిస్తుందన్న కోటంరెడ్డి
  • పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని వ్యాఖ్య
  • ప్రతి టీడీపీ నేత, కార్యకర్తను పాదయాత్రకు ఆహ్వానించామన్న ఎమ్మెల్యే
నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోకి టీడీపీ యువనేత నారా లోకేశ్ పాదయాత్ర రేపు ప్రవేశించబోతోంది. యువగళం పాదయాత్రకు సంబంధించి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనుచరులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. లోకేశ్ పాదయాత్ర ఒక ప్రభంజనంలా కొనసాగుతోందని చెప్పారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తూ, ప్రజల సమస్యలను తెలుసుకుంటూ లోకేశ్ పాదయాత్ర కొనసాగుతోందని అన్నారు. లోకేశ్ కు అన్ని నియోజకవర్గాల ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. 

రేపు మధ్యాహ్నం 2.30 గంటలకు నెల్లూరు రూరల్ లో కాకుపల్లి గ్రామం నుంచి లోకేశ్ పాదయాత్ర మొదలవుతుందని తెలిపారు. రూరల్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి టీడీపీ నేత, కార్యకర్తను పాదయాత్రకు ఆహ్వానించామని చెప్పారు. లోకేశ్ ను అందరూ కలిసేలా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిపక్షాలకు చెందిన అన్ని పార్టీల వారిపై అక్రమ కేసులు పెడుతోందని, ఈ కేసులు నిలిచేవి కావని... టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ కేసులన్నింటినీ ఎత్తివేస్తామని, అక్రమ కేసులను బనాయించిన అధికారులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో 10కి 10 స్థానాలను టీడీపీ గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.
Kotamreddy Sridhar Reddy
Nara Lokesh
Telugudesam
Yuva Galam Padayatra

More Telugu News