Oceangate: ‘టైటాన్’ పేలిపోయి పదిరోజులైనా కాలేదు.. ‘టైటానిక్‌ శకలాలు చూసొద్దాం రండి’ అంటూ యాడ్ ఇచ్చిన ఓషన్ గేట్‌!

Days After Sub Tragedy Oceangate Advertises Trip To Titanic Shipwreck
  • వచ్చే ఏడాది రెండు ట్రిప్‌లు నిర్వహిస్తున్నామన్న ఓషన్‌గేట్‌
  • టికెట్‌ ధరను 2,50,000 డాలర్లుగా పేర్కొన్న సంస్థ
  • సబ్‌ పైలట్ పొజిషన్‌ కోసం కూడా యాడ్
మునిగిపోయిన టైటానిక్ ఓడను చూసేందుకు వెళ్లి.. సముద్ర గర్భంలో టైటాన్‌ మినీ జలాంతర్గామి పేలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగి 10 రోజులైనా కాలేదు.. ఇంకా శకలాల వెలికితీత, దర్యాప్తు కొనసాగుతోంది. ఇంతలోనే మళ్లీ ‘టైటానిక్‌ శకలాలు చూసొద్దాం రండి’ అంటూ ఓషన్‌గేట్‌ సంస్థ ప్రకటన ఇచ్చింది.

వచ్చే ఏడాది రెండు ట్రిప్‌లు నిర్వహిస్తున్నామని ఓషన్‌గేట్‌ తమ వెబ్‌సైట్‌లో యాడ్ ఇచ్చింది. ఓషన్‌గేట్‌ వెబ్‌సైట్‌ ప్రకారం.. 2024 జూన్‌ 12వ తేదీ నుంచి జూన్‌ 20 మధ్య, అలాగే జూన్‌ 21 నుంచి జూన్‌ 29 మధ్య రెండు ట్రిప్పులు ప్లాన్‌ చేసినట్లు ఓషన్‌గేట్‌ కంపెనీ ఆ ప్రకటనల్లో పేర్కొంది. టికెట్‌ ధరను 2,50,000 డాలర్లుగా ప్రకటించింది. అయితే అది టైటాన్‌లోనా? ఇంకో సబ్‌మెర్సిబుల్‌లోనా? అనేది మాత్రం స్పష్టత ఇవ్వలేదు. పైగా సబ్‌ పైలట్ పొజిషన్‌ కోసం కూడా యాడ్ ఇచ్చింది. 

అమెరికాకు చెందిన అండర్‌వాటర్‌ టూరిజం కంపెనీ ఓషన్‌గేట్.. ఇటీవల టైటానిక్ ఓడ దగ్గరికి కొందరిని తీసుకెళ్లింది. అయితే సముద్రంలో జరిగిన ప్రమాదంలో ఐదుగురు చనిపోయారు. కంపెనీ సీఈవో స్టాక్‌టన్‌ రష్‌ కూడా దుర్మరణం పాలయ్యారు. కానీ అనూహ్యంగా కంపెనీ మళ్లీ టైటానిక్‌ టూర్‌ను నిర్వహించేందుకు రెడీ కావడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇక టైటాన్‌ మినీ జలాంతర్గామి శకలాలను సముద్ర గర్భం నుంచి ఒడ్డుకు చేర్చినట్టు అమెరికా కోస్ట్‌గార్డ్ దళాలు వెల్లడించాయి. కెనడాలోని సెయింట్‌ జాన్స్‌ ఓడరేవుకు బుధవారం వాటిని తీసుకొచ్చినట్టు తెలిపాయి. చనిపోయిన ఐదుగురు పర్యాటకుల మృతదేహాల అవశేషాలను టైటాన్ శకలాల నుంచి అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నాయి. ‘టైటాన్ శకలాల నుంచి పొందిన మానవ అవశేషాల అధికారిక విశ్లేషణను అమెరికా వైద్య నిపుణులు జాగ్రత్తగా నిర్వహిస్తారు’ అని వివరించాయి.


Oceangate
Titanic Shipwreck
Titanic
Titan Sub

More Telugu News