Crime News: విద్యార్థి దారుణం.. ప్రిన్సిపల్‌పై బ్లేడుతో దాడి!

Student attacks college principal in Prakasam district in AP
  • ప్రకాశం జిల్లా గిద్దలూరులో వెలుగు చూసిన ఘటన 
  • గతేడాది పరీక్షలో కాపీ కొట్టి డిబార్ అయిన విద్యార్థి
  • నాటి నుంచీ పరీక్ష కేంద్రం ప్రిన్సిపల్‌పై కక్ష పెంచుకున్న వైనం
  • గురువారం బ్లేడుతో ప్రిన్సిపల్ గొంతుకోసేందుకు యత్నం
  • బాధితుడిని ఆసుపత్రికి తరలించిన స్థానికులు
  • నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

తనను డిబార్ చేశారన్న కోపంతో ఓ విద్యార్థి దారుణానికి తెగబడ్డాడు. కాలేజీ ప్రిన్సిపల్‌పై దాడికి తెగబడ్డ నిందితుడు బ్లేడుతో అతని గొంతు కోసే ప్రయత్నం చేశాడు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో గురువారం ఈ ఘటన జరిగింది. చిన్నమసీదు ప్రాంతంలో ఉండే గొంట్ల గణేశ్ స్థానిక సాహితీ జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో గతేడాది ఇంటర్ పరీక్షలకు హాజరయ్యాడు. పరీక్షల సందర్భంగా అతడు కాపీ కొడుతూ దొరికిపోవడంతో స్క్వాడ్ డిబార్ చేసింది. నాటి నుంచీ అతడు ఆ కళాశాల ప్రిన్సిపల్ మూల కొండారెడ్డిపై కక్షతో రగిలిపోయాడు. 

స్థానిక గాంధీ బొమ్మ కూడలి వద్ద గురువారం రాత్రి కొండారెడ్డి‌పై గణేశ్ అకస్మాత్తుగా దాడికి దిగాడు. బ్లేడుతో అతడు కొండారెడ్డి గొంతు కోయబోతుంటే ఆయన చేయి అడ్డుపెట్టి తప్పించుకున్నారు. ఈ క్రమంలో చేతికి కూడా గాయమైంది. వెంటనే స్థానికులు కొండారెడ్డిని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి వెళ్లి కొండారెడ్డితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం, గణేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News