NRI: ఎన్నారై టీనేజర్ మృతిపై కోర్టు విచారణ.. ఆ టెస్టు చేసుంటే బాలుడు బతికుండేవాడేమో!

Protein drinks should carry warning after boy died says coroner
  • మూడేళ్ల నాటి కేసులో కోర్టును ఆశ్రయించిన బాలుడి తల్లిదండ్రులు
  • బాలుడికి అరుదైన జన్యువ్యాధి, ఓర్నిథిన్ ట్రాన్స్‌కార్బమైలేజ్ ఎంజైమ్ లోపంతో సతమతం
  • ఎంజైమ్ లేమి కారణంగా ప్రోటీన్ షేక్ తో శరీరంలో ప్రమాదకర స్థాయికి అమ్మోనియా
  • మెదడు దెబ్బతినడంతో బాలుడి మృతి
  • ఈ ప్రమాదం గురించి ప్రొటీన్ షేక్‌ల ప్యాకింగ్‌పై స్పష్టంగా ముద్రించాలన్న ప్రభుత్వ అధికారి
ప్రొటీన్ షేక్‌లతో ఆరోగ్య సమస్య తలెత్తే ప్రమాదం ఉంటే ఆ విషయాన్ని ప్యాకింగ్‌పై స్పష్టంగా ముద్రించాలని బ్రిటన్‌కు చెందిన ఓ సీనియర్ అధికారి తాజాగా అభిప్రాయపడ్డారు. మూడేళ్ల క్రితం ప్రొటీన్ షేక్ తాగిన భారత సంతతి టీనేజర్ రోహన్ గోధానియా మరణించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ రకమైన హెచ్చరికలు ప్రోటీన్ షేక్‌లపై ఉండాలంటూ రోహన్ తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించారు. విచారణ సందర్భంగా పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. 

రోహన్ శరీర దారుఢ్యం మెరుగయ్యేందుకు అతని తండ్రి 2020 ఆగస్టు 15న ప్రొటీన్ షేక్ కొనిచ్చారు. అది తాగిన రోహన్ అనారోగ్యం పాలయ్యాడు. వెస్ట్ మిడిల్‌సెక్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ తరువాత మూడు రోజులకే మరణించాడు. టీనేజర్ మరణానికి కారణం ఏంటో తొలుత ఎవరికీ తెలియలేదు. కానీ, బాలుడిలో ఓర్నిథిన్ ట్రాన్స్ కార్బమైలేజ్ ఎంజైమ్ లోపించిన కారణంగా మరణం సంభవించినట్టు ఆ తరువాత తేలింది. 

బాలుడి శరీరంలో ఎంజైమ్ లోపించిన కారణంగా ప్రొటీన్ షేక్ తాగిన అనంతరం రక్తంలో అమ్మోనియా ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఫలితంగా బాలుడి మెదడు పూర్తిగా దెబ్బతిని అతడు మరణించాడు. అయితే, ఆసుపత్రిలో చేరిన తొలి రోజునే బాలుడికి అమ్మోనియా స్థాయులను తెలిపే టెస్టు చేయించి ఉంటే బాగుండేదని కోర్టులో బాలుడి తరపు న్యాయవాదులు అభిప్రాయపడ్డారు. ఎంజైమ్ లోపించిన కారణంగానే  రోహన్ మరణించాడని ఈ కేసులో దర్యాప్తు చేస్తున్న అధికారి(కరోనర్) వ్యాఖ్యానించారు. ప్రోటీన్ షేక్‌లతో ఇటువంటి ప్రమాదం వచ్చే అవకాశం ఉందన్న విషయాన్ని ప్యాకింగ్‌పై స్పష్టంగా కనిపించేలా ముద్రించాలని అభిప్రాయపడ్డారు.
NRI
UK
protein shake
Rohan Godhania

More Telugu News