Pawan Kalyan: పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన తూర్పు కాపు నేతలు

  • భీమవరం చేరుకున్న పవన్ వారాహి యాత్ర
  • పెదఅమిరంలో తూర్పు కాపులతో పవన్ సమావేశం
  • తూర్పు కాపుల కోసం ఏదైనా చేయాలన్న ఆలోచన మొదలైందన్న జనసేనాని
  • తూర్పు కాపులకు తాను అండగా ఉంటానని ఉద్ఘాటన
Thurpu Kapu leaders joins Janasena

వారాహి యాత్రలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం చేరుకున్న జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ నేడు తూర్పు కాపులతో సమావేశమయ్యారు. కాళ్ల మండలం పెదఅమిరంలో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ సమక్షంలో తూర్పు కాపు నేతలు జనసేన పార్టీలో చేరారు. సదరు నేతలు వివిధ సమస్యలను పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకువచ్చారు. 

ఈ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, తూర్పు కాపులు ఎక్కువగా వలస వెళుతున్నారని, వంశధార నిర్వాసితుల్లో ఎక్కువ మంది తూర్పు కాపులేనని విచారం వ్యక్తం చేశారు. దేశంలో ఏ నిర్మాణం వెనుకైనా ఉత్తరాంధ్ర తూర్పు కాపులు ఉన్నారని పేర్కొన్నారు. 

తూర్పు కాపుల జనాభాపై ఒక్కో ప్రభుత్వం ఒక్కో లెక్క చెబుతోందని పవన్ కల్యాణ్ విమర్శించారు. జనసేన వస్తే ముందుగా తూర్పు కాపుల గణాంకాలు తీస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ సమాజంలోనూ తూర్పు కాపుల సంఖ్య ఎక్కువేనని అన్నారు. సమాజానికి మేలు చేసే తూర్పు కాపులకు ఏమివ్వాలన్న ఆలోచన మొదలైందని తెలిపారు. 

తూర్పు కాపుల్లో ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ఉన్నారని... నాయకులు బాగుపడుతున్నారే కానీ కులం ఎదగడం లేదని పవన్ వ్యాఖ్యానించారు. ఉత్తరాంధ్ర కాపులకు ఆ మూడు జిల్లాలు దాటితే గుర్తింపు కార్డులు ఉండవని, తెలంగాణలో అయితే తూర్పు కాపులను బీసీల నుంచి తీసేశారని అన్నారు. దీనిపై ఒక్క నాయకుడు కూడా అడగలేదని విమర్శించారు. తూర్పు కాపులకు హామీ ఇస్తున్నా... నేను మీ వెంట ఉంటా! అని పవన్ ఉద్ఘాటించారు. 

ఇక, తాను సీఎం అయితే అద్భుతాలేమీ జరగవని, సీఎం పదవి అనేది మంత్రదండం కాదని స్పష్టం చేశారు. చైతన్యవంతమైన సమాజమే మంత్రదండం అని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో, ఆకాశం తెచ్చి చేతిలో పెడతామని నేతలు హామీలు ఇస్తారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News