Srinivasa Reddy: వైసీపీ కార్యకర్త శ్రీనివాసరెడ్డి హత్య కేసులో ఆరుగురి అరెస్ట్... నిందితుల్లో ఒకరు మహిళ

Police arrest six people in YCP worker Srinivasa Reddy murder in Kadapa
  • కడపలో సంచలనం సృష్టించిన హత్య
  • నిందితులను మీడియా ఎదుట ప్రవేశపెట్టిన కడప ఎస్పీ
  • భూ వివాదాలు, సెటిల్ మెంట్ కారణంగానే హత్య జరిగిందని వెల్లడి
  • ఇందులో రాజకీయ కోణం లేదని స్పష్టీకరణ

ఇటీవల కడపలో నడిరోడ్డుపై శ్రీనివాసరెడ్డి అనే వైసీపీ కార్యకర్త హత్యకు గురికావడం తెలిసిందే. బురఖాలు ధరించి వచ్చిన నలుగురు వ్యక్తులు కత్తులతో దాడి చేయడంతో శ్రీనివాసరెడ్డి మరణించాడు. కాగా, ఈ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. కడప ఎస్పీ అన్బురాజన్ నిందితులను మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. 

ప్రధాన నిందితుడు ప్రతాప్ రెడ్డి సహా శ్రీనివాసులు, సురేశ్ కుమార్, హరిబాబు, సుబ్బయ్య, రాణి అనే వ్యక్తులను అరెస్ట్ చేశామని ఎస్పీ వెల్లడించారు. భూ వివాదాలతోనే శ్రీనివాసులరెడ్డి హత్య జరిగిందని, ఎలాంటి రాజకీయ కోణం లేదని స్పష్టం చేశారు. 

శ్రీనివాసులరెడ్డికి, ప్రతాప్ రెడ్డికి మధ్య ల్యాండ్ సెటిల్ మెంట్ లో విభేదాలు వచ్చాయని వెల్లడించారు. శ్రీనివాసులరెడ్డి... ప్రతాప్ రెడ్డికి రూ.80 లక్షలు, శ్రీనివాసులుకు రూ.60 లక్షలు ఇవ్వాల్సి ఉందని ఎస్పీ వివరించారు. డబ్బు ఇవ్వకపోవడంతో నిందితులు కక్ష పెంచుకున్నారని తెలిపారు. ఈ కేసులో నిందితులకు సహకరించిన రాణి అనే మహిళను కూడా అరెస్ట్ చేశామని చెప్పారు. 

మరికొందరు అనుమానితులకు నోటీసులు జారీ చేశామని వెల్లడించారు. కేసులో ఎంతటివారున్నా వదిలిపెట్టే ప్రసక్తేలేదని ఎస్పీ అన్బురాజన్ స్పష్టం చేశారు. గూగుల్ టేకౌట్ ద్వారా ఆధారాలు సేకరిస్తున్నామని అన్నారు. త్వరలో మరికొందరిని అదుపులోకి తీసుకునే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. 

కాగా, శ్రీనివాసులరెడ్డి హత్య సమయంలో నిందితుల చేతి నుంచి జారిపడిన కొడవలిని ఓ మహిళ ధైర్యంగా పక్కకు నెట్టేసిందని, ఆ మహిళ ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందేనని ఎస్పీ తెలిపారు. ఆమెను పోలీస్ శాఖ తరఫున సన్మానిస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News