Smriti Irani: తోడేళ్లే గుంపుగా వస్తాయి.. అయినా సింహాన్ని ఓడిస్తాయా?: ప్రతిపక్షాల సమావేశంపై స్మృతి ఇరానీ

wolves hunt in packs smriti irani on opposition leaders meeting
  • తల్లులు, అక్కాచెల్లెళ్ల ఆశీర్వాదం ఉన్న సింహాన్ని తోడేళ్లు ఎలా వేటాడతాయన్న స్మృతి
  • ప్రతిపక్షాల మీటింగ్ లక్ష్యం మోదీ కాదని వ్యాఖ్య
  • దేశ ప్రజలు, ఖజానా కోసమే సమావేశమయ్యాయని ఆరోపణ
ప్రతిపక్షాల సమావేశంపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సెటైర్లు వేశారు. తోడేళ్లే గుంపుగా వస్తాయని ఎద్దేవా చేశారు. శుక్రవారం నాటి ప్రతిపక్షాల మీటింగ్ లక్ష్యం ప్రధాని నరేంద్ర మోదీ కాదని, దేశ ప్రజలు, ఖజానా అని ఆరోపించారు.

ఈ రోజు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ లో జరిగిన కార్యక్రమంలో స్మృతి ఇరానీ మాట్లాడుతూ..‘‘తోడేళ్లు వేటకు వెళ్లినప్పుడు గుంపులుగా బయటకు వెళ్తాయి. కానీ తోడేళ్లు సింహాన్ని వేటాడడం అసాధ్యం. తల్లులు, అక్కాచెల్లెళ్ల ఆశీర్వాదం ఉన్న సింహాన్ని తోడేళ్లు ఎలా వేటాడతాయి” అని అన్నారు. 

‘‘పాట్నాలో కమ్యూనిస్ట్ పార్టీ, కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తు కనిపించింది. కానీ కేరళలో మాత్రం కాంగ్రెస్ అధ్యక్షుడిని కమ్యూనిస్టు పార్టీ జైలులో పెట్టింది. అలానే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. లాలూ ప్రసాద్ యాదవ్ పాదాలను తాకారు. కానీ ఇదే మమత.. గతంలో పార్లమెంటులోనే లాలూ అవినీతిపరుడని అన్నారు” అని మండిపడ్డారు.

శుక్రవారం పాట్నాలో జరిగిన సమావేశంలో మొత్తం 17 ప్రతిపక్ష పార్టీలు పాల్గొన్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించడానికి ఐక్యంగా పోరాడాలని, తమ విభేదాలను పక్కనపెట్టి పనిచేయాలని తీర్మానించాయి.

ఈ కూటమికి పీడీఏ (పేట్రియాటిక్ డెమొక్రాటిక్ అలయన్స్)గా పేరు పెట్టినట్లు సమాచారం. జులై నెలలో సిమ్లాలో జరిగే సమావేశంలో అధికారికంగా ఈ పేరును ప్రకటించాలని ప్రతిపక్షాలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Smriti Irani
Narendra Modi
opposition leaders meet
Congress

More Telugu News