Army: మిలిటెంట్ల విడుదల కోసం ఆర్మీని చుట్టుముట్టిన మణిపూర్ మహిళలు

Army Frees 12 Manipur Militants As Mob Of 1500 Blocks Way
  • రోజంతా కొనసాగిన ఉద్రిక్తత.. చివరకు వెనక్కి తగ్గిన సైన్యం
  • 12 మంది మిలిటెంట్లను విడిచిపెట్టిన అధికారులు
  • రాష్ట్రంలో కొనసాగుతున్న హింసాత్మక ఆందోళనలు
మణిపూర్ రావణకాష్టంలా రగులుతూనే ఉంది. రాష్ట్రంలో ఏదో ఒక చోట రోజూ దాడులు, ప్రతి దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో బందోబస్తు విధులు నిర్వహిస్తున్న ఆర్మీ సిబ్బందికి కొత్త సమస్య ఎదురైంది. తూర్పు ఇంఫాల్ లోని ఓ గ్రామంలో సోదాలు జరిపి పట్టుకున్న మిలిటెంట్లను మహిళల ఒత్తిడికి తలొగ్గి విడిచిపెట్టాల్సి వచ్చింది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల కారణంగా ఆర్మీ వెనక్కి తగ్గక తప్పలేదు.

నిఘా వర్గాల విశ్వసనీయ సమాచారంతో శనివారం తూర్పు ఇంఫాల్ లోని ఇథం గ్రామంలో ఆర్మీ స్పెషల్ ఆపరేషన్ నిర్వహించింది. గ్రామంలో సోదాలు జరిపి మైతేయ్ మిలిటెంట్ గ్రూప్ కేవైకేఎల్ కు చెందిన 12 మంది మిలిటెంట్లను అదుపులోకి తీసుకుంది. పెద్ద ఎత్తున ఆయుధాలనూ స్వాధీనం చేసుకుంది. 2015 లో 6 డోగ్రా యూనిట్ పై జరిగిన దాడిలో ఈ బృందం హస్తం ఉందని ఉన్నతాధికారులు వెల్లడించారు.

ఈ క్రమంలో గ్రామస్థులు పెద్ద సంఖ్యలో గుమికూడారు. మహిళలు ముందుకొచ్చి సైనికులను అడ్డుకున్నారు. మిలిటెంట్లను విడిచిపెట్టాలంటూ సుమారు 1500 మంది మహిళలు సైనికులను ముందుకు కదలనివ్వలేదు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలని ఎన్నిమార్లు విజ్ఞప్తి చేసినా వారు వినిపించుకోలేదు. గంటల తరబడి అలాగే అడ్డుకున్నారు. దాదాపు రోజంతా ప్రతిష్టంభన కొనసాగింది. చివరకు సైన్యం వెనక్కి తగ్గి, 12 మంది మిలిటెంట్లను విడిచిపెట్టింది. ఆయుధాలను మాత్రం అక్కడి నుంచి తరలించినట్లు సైనిక అధికారులు తెలిపారు.
Army
Manipur
Militants
Mob
Blocks Way
Army Frees Militants

More Telugu News