Narendra Modi: అమెరికా పర్యటన ముగించుకుని ఈజిప్టు పయనమైన ప్రధాని మోదీ

  • మూడ్రోజుల పాటు అమెరికాలో పర్యటించిన మోదీ
  • పలు చారిత్రాత్మక ఒప్పందాలు సాకారం
  • 1997 తర్వాత ఈజిప్టులో ఓ భారత ప్రధాని అడుగుపెట్టడం ఇదే ప్రథమం
  • ఈజిప్టు అధ్యక్షుడితో భేటీ కానున్న మోదీ 
  • ప్రవాస భారతీయ సంఘాలను కూడా కలవనున్న ప్రధాని 
Modi off to Egypt after three day US tour conclusion

భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన ముగిసింది. పలు చారిత్రాత్మక ఒప్పందాలతో భారత్-అమెరికా ద్వైపాక్షిక సంబంధాలకు కొత్త నిర్వచనం ఇచ్చేలా ఈ పర్యటన సాగింది. కాగా, అమెరికా నుంచి ప్రధాని మోదీ ఈజిప్టు పర్యటనకు బయల్దేరి వెళ్లారు. 1997 తర్వాత ఓ భారత ప్రధాని ఈజిప్టు వెళ్లడం ఇదే ప్రథమం. 

ఈజిప్టు పర్యటనపై మోదీ స్పందిస్తూ, తమకు అత్యంత సన్నిహితమైన దేశం ఈజిప్టు అని అభివర్ణించారు. ఈజిప్టును సందర్శించనుండడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. 

మోదీ ఈజిప్టు పర్యటనలో భాగంగా ఆ దేశాధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్ సిసీతో ఇరు దేశాల మధ్య బహుళ భాగస్వామ్యాల గురించి, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంపై ఉమ్మడి ప్రణాళికల గురించి చర్చించనున్నారు. ఈజిప్టు ప్రభుత్వ పెద్దలతోనూ, ఈజిప్టు ప్రముఖులతోనూ ప్రధాని మోదీ సమావేశం కానున్నారు. 

ఆయన తన పర్యటనలో భాగంగా ఈజిప్టులోని ప్రవాస భారతీయ సంఘాలను కూడా కలవనున్నారు. ఈజిప్టు రాజధాని కైరోలోని హీలియోపొలిస్ కామన్వెల్త్ యుద్ధ శ్మశానవాటికను సందర్శించనున్నారు. మొదటి ప్రపంచయుద్ధంలో ఈజిప్టు-పాలస్తీనా తరఫున వీరోచితంగా పోరాడి అసువులుబాసిన 4 వేల మంది భారతీయ సైనికులకు నివాళులు అర్పిస్తారు.

More Telugu News