power: పగలు ఊరట.. రాత్రి కరెంట్ వినియోగిస్తే షాక్: కొత్త విద్యుత్ నిబంధనలు.. కారణమిదే

  • విద్యుత్ ఛార్జీల నియమనిబంధనల్లో కేంద్రం మార్పులు
  • టైమ్ ఆఫ్ డే టారిఫ్ సిస్టమ్ పేరుతో కొత్త విధానం
  • ఉదయం 20 శాతం తగ్గనున్న భారం, రాత్రి ఇరవై శాతం వరకు మోత
New tariff rule to allow up to 20 pc saving in power bills for usage during solar hours

విద్యుత్ ఛార్జీల నియమనిబంధనల్లో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసింది. టైమ్ ఆఫ్ డే టారిఫ్ సిస్టమ్ పేరుతో తీసుకువస్తున్న ఈ విధానం ద్వారా ఉదయం వేళల్లో వినియోగదారులపై ఛార్జీల భారం 20 శాతం మేర తగ్గనుంది. అదే సమయంలో డిమాండ్ ఎక్కువగా ఉండే రాత్రివేళ్లలో విద్యుత్ ఛార్జీలు సాధారణం కంటే పది శాతం నుండి ఇరవై శాతం మేర పెరుగుతాయని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ తెలిపారు.

పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని పెంచే  లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది. ఈ కొత్త వ్యవస్థను అమలు చేయడం వల్ల పీక్‌ సమయాల్లో గ్రిడ్‌పై భారంతో పాటు విద్యుత్ డిమాండ్ తగ్గుతుందని వెల్లడించింది. 2024 ఏప్రిల్ నుండి తొలుత వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులకు ఈ విధానం అమలులోకి వస్తుందని, ఏడాది తర్వాత అంటే ఏప్రిల్ 1, 2025 నుండి వ్యవసాయ రంగం మినహా, మిగతా అన్ని రంగాల విద్యుత్ వినియోగదారులకు వర్తింపజేయనున్నట్లు తెలిపింది. యూజర్లు ఏ సమయంలో ఎంత విద్యుత్ వినియోగించారో స్మార్ట్ మీటర్ల ఆధారంగా గుర్తించనున్నట్లు తెలిపింది.

డిమాండ్ తక్కువగా ఉన్న సమయంలో ఎక్కువ విద్యుత్ ను వాడుకునేలా ప్రోత్సహించడం ద్వారా గ్రిడ్ పై భారం తగ్గించాలని కేంద్రం భావిస్తోంది. ఉదయం సమయంలో సోలార్ పవర్ అందుబాటులో ఉండటం వల్ల దాని ధర తక్కువగా ఉంటుంది. అందుకే ఉదయం వేళలను సోలార్ అవర్స్ గా పేర్కొంటూ ఆ సమయంలో వినియోగదారులకు లబ్ధి చేకూర్చేలా విద్యుత్ ఛార్జీలు తక్కువ చేసినట్లు ఆర్కే సింగ్ తెలిపారు. రాత్రివేళ హైడ్రో, థర్మల్, బయోమాస్ విద్యుత్ వినియోగం పెరుగుతుందని, వాటి నిర్వహణ ఖర్చులు పెరుగుతాయని, అందుకే రాత్రి వేళల్లో విద్యుత్ ఛార్జీల ధరలు పెంచాలని నిర్ణయించినట్లు చెప్పారు. తమ విద్యుత్ అవసరాలను సోలార్ అవర్స్ కు మార్చుకునే వారికి లబ్ధి చేకూరుతుందన్నారు.

2030 నాటికి శిలాజేతర ఇంధనాల శక్తి సామర్థాన్ని 65 శాతం చేరేందుకు ఈ విధానం సహాయ పడుతుందని ఆర్కే సింగ్ తెలిపారు. అలాగే 2070 నాటికి సున్నా ఉద్గారాల లక్ష్యానికి అనుగుణంగా ఈ దిశగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

  • Loading...

More Telugu News