Pawan Kalyan: నేను పదేపదే సినిమా పరిశ్రమ గురించి మాట్లాడ్డానికి కారణం ఇదే: పవన్ కల్యాణ్

  • అమలాపురంలో బహిరంగ సభ
  • కోనసీమ ప్రజల్లో ఘాటు, ప్రేమ వుంటాయన్న పవన్
  • సినిమాల్లో అభిమానమే కాకుండా, ప్రజల్లోకి వచ్చి కష్టాలు కూడా చూశానని వెల్లడి
  • అందుకే రాజకీయాల్లోకి వచ్చానని స్పష్టీకరణ
Pawan Kalyan speech in Amalapuram

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అమలాపురం బహిరంగ సభలో ప్రసంగించారు. 'డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రజలకు నా నమస్కారాలు' అంటూ పవన్ తన ప్రసంగం ప్రారంభించారు. కోనసీమ ప్రజల్లో ఘాటు ఉంటుంది, ప్రేమ ఉంటుంది, ఈ గడ్డపై అగ్ని ఉందని అన్నారు. 

జిల్లాకు అంబేద్కర్ కోనసీమ జిల్లా అని పేరు పెట్టాలని అనుకున్నప్పుడు ప్రజలకు నేరుగా చెప్పి ప్రజాభిప్రాయ సేకరణ జరపాల్సిందని, వద్దు అన్నవారితో మాట్లాడి వారిని ఒప్పిస్తే బాగుండేదని, కానీ అలా చేయకుండా కావాలనే గొడవలు పెట్టారని మండిపడ్డారు. 

తాను సినిమాలు చేస్తే ప్రజల అభిమానం, వారి కేరింతలు, కటౌట్లు మాత్రమే ఉంటాయని, కానీ, తాను ప్రజల కష్టాలు కూడా చూశానని, అందుకే రాజకీయాల్లోకి వచ్చానని వెల్లడించారు. మహేశ్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, చిరంజీవి, బాలకృష్ణ, ప్రభాస్, ఎన్టీఆర్, నితిన్, రవితేజ అభిమానులందరికీ నమస్కారం అని పేర్కొన్నారు. 

తాను పదేపదే సినిమా పరిశ్రమ గురించి మాట్లాడ్డానికి కారణం, హీరోల్లో ఎవరం సినిమా చేసినా వందలాది మందికి ఉపాధి దొరుకుతుందని పవన్ కల్యాణ్ తెలిపారు. థియేటర్లలో పరోక్షంగా, థియేటర్ వెలుపల తోపుడు బండ్ల వ్యాపారాలు... ఇలా సినీ పరిశ్రమ వేలాది మందికి ఉపాధి కల్పిస్తుందని వివరించారు. 

కానీ వైసీపీ వచ్చాక రాష్ట్రంలో ఉపాధి కరవైందని విమర్శించారు. జగన్ ఒక్క అవకాశం అని అడిగారని, ఒక్క అవకాశం ఇస్తే ఉద్యోగులకు సమయానికి జీతాలు రాకుండా చేశారని పవన్ మండిపడ్డారు. ఇచ్చిన మాట తప్పిన సీఎం జగన్ సీపీఎస్ రద్దు చేయలేదని తెలిపారు. రైతులకు సకాలంలో బీమా అందడంలేదు, పంట సాయం లేదు, ఉద్యోగాలు లేవు, పెన్షన్లు లేవు, ఇంకెందుకు ఇవ్వాలి మీకు చాన్స్? అంటూ ప్రశ్నించారు.

More Telugu News