Telangana: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం ఫోకస్​

Central Election Commission officials visit to telangana
  • రాష్ట్రానికి కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు
  • మూడు రోజుల పాటు ఏర్పాట్లపై అధికారుల సమీక్ష 
  • ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరిపేందుకు కసరత్తు!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది చివర్లోనే ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులు ఈ రోజు నుంచి మూడు రోజులపాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తం చేసే చర్యలు తీసుకోనున్నారు. నేడు తెలంగాణ ఎన్నికల కమిషనర్‌తో భేటీ అవుతారు. రేపు కలెక్టర్లు, ఎస్పీలతో, ఎల్లుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సమీక్ష నిర్వహించనున్నారు. 

ఇంతకుముందు తెలుగు రాష్ట్రాల్లో లోక్ సభ ఎన్నికలతో పాటే అసెంబ్లీ ఎన్నికలు జరిగేవి. కానీ, 2018లో సీఎం కేసీఆర్ ముందుగానే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లారు. ఐదేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఈ ఏడాది చివర్లోనే అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఎలక్షన్ కమిషన్ సన్నద్దమవుతోంది. ఇప్పటికే ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర స్థాయి అధికారులకు ఈ నెల 5 నుంచి 10 వరకూ ఈసీ మాస్టర్ ట్రైనర్స్‌కు శిక్షణ ఇచ్చింది. మూడు సంవత్సరాలు ఒకే చోట పనిచేస్తున్న అధికారుల బదిలీలపై రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వడంతో ఈ బదిలీల ప్రక్రియ కూడా ప్రారంభమైంది. జులై 31 లోపు ఈ బదిలీల ప్రక్రియ పూర్తి కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2.99 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు.
Telangana
Telangana Assembly Election
Central Election Commission
visit
BRS
KCR

More Telugu News