Titanic: ఆశలు ఆవిరి.. జలాంతర్గామి గాలింపు చర్యల్లో కనిపించని పురోగతి

There is no hopes on Titan which goes to see titanic wreckage
  • టైటానిక్ నౌక శకలాలు చూసేందుకు వెళ్లి గల్లంతైన మినీ జలాంతర్గామి టైటాన్
  • రోజులు గడుస్తున్నా కనిపించని జాడ
  • దాదాపు నిండుకున్న ఆక్సిజన్ నిల్వలు
  • గాలింపు చర్యలు ముమ్మరం
అట్లాంటిక్ మహాసముద్రంలోని టైటానిక్ నౌక శకలాలను చూసేందుకు వెళ్లి గల్లంతైన మినీ జలాంతర్గామి కనిపిస్తుందన్న ఆశలు క్షణాలు గడుస్తున్న కొద్దీ ఆవిరవుతున్నాయి. సహాయక బృందాలు సముద్రాన్ని అణువణువు గాలిస్తున్నా దాని జాడ మాత్రం కనిపించడం లేదు. దీనికితోడు అందులోని ఆక్సిజన్ నిల్వలు దాదాపు అయిపోవచ్చాయి. దీంతో ఆ సబ్‌మెర్సిబుల్‌లోని ఐదుగురు ప్రాణాలతో బతికి బయటపడే అవకాశాలు దాదాపు మృగ్యమయ్యాయి. 

జాడలేకుండా పోయిన సబ్‌మెర్సిబుల్ ‘టైటాన్’ నుంచి నిన్న ప్రతి అరగంటకు ఒకసారి శబ్దాలు రావడంతో అది సురక్షితంగా ఉందని, అందులోని వారు ప్రాణాలతో ఉండే అవకాశం ఉందని భావించారు. అప్పటికి ఇంకా 30 గంటల ఆక్సిజన్ నిల్వలు ఉండడంతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కెనడా, అమెరికా తీర రక్షక దళాలు సముద్రాన్ని జల్లెడ పడుతున్నా ఇసుమంతైనా ప్రయోజనం కనిపించడం లేదు. ఫలితంగా ‘టైటాన్’ తిరిగి సురక్షితంగా ఒడ్డుకు చేరుకుంటుందన్న ఆశలు గల్లంతయ్యాయి. 

ఏదైనా అద్భుతం జరిగితే తప్ప అందులోని పర్యాటకులు బతికి బయటపడడం దాదాపు అసాధ్యంగా మారింది. కాగా, ఆదివారం న్యూఫౌండ్‌ల్యాండ్ నుంచి బయలుదేరిన టైటాన్ ఆచూకీ ఆ తర్వాత కొంతసేపటికే గల్లంతైంది. అందులో పాకిస్థాన్ బిలియనీర్ షెహజాదా దావూద్ (48), ఆయన కుమారుడు సులేమాన్ (19), యూఏఈలో ఉంటున్న బ్రిటిష్ వ్యాపారవేత్త హమీష్ హార్డింగ్, యాత్ర నిర్వాహకుడు, ఓషన్ గేట్ వ్యవస్థాపకుడు స్టాక్టన్ రష్, ఫ్రెంచ్ మాజీ నావికాదళ అధికారి పాల్ హెన్రీ ఉన్నారు.
Titanic
Titanic Submarine
Atlantic Ocean

More Telugu News