Chandrababu: చంద్రబాబుపై సోము వీర్రాజు వ్యాఖ్యలు అభ్యంతరకరం: అచ్చెన్నాయుడు

  • జగన్‌పై కేంద్రం చర్యలు తీసుకోవాలంటే సోము వీర్రాజుకు అసహనం ఎందుకన్న అచ్చెన్నాయుడు
  • రాష్ట్రంలో పాలన గాడి తప్పినప్పుడు జోక్యం చేసుకునే అధికారం కేంద్రానికి ఉందని స్పష్టీకరణ
  • ఏపీలో పరిస్థితిపై అమిత్ షా, నడ్డా ఆందోళన వ్యక్తం చేశారన్నది వాస్తవం కాదా అని ప్రశ్న
  • ప్రతిపక్ష పార్టీపై విమర్శలు కట్టిపెట్టి, ప్రజాసమస్యలపై పోరాడాలని హితవు
atchannaidu raises objection to bjp ap chief somu veerraju criticising chandrababu

తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. రాష్ట్రాన్ని రావణ కాష్ఠంగా మార్చిన సీఎం వైఎస్ జగన్‌పై కేంద్రం చర్యలు తీసుకోవాలని అంటే సోము వీర్రాజుకు ఎందుకంత కోపం, అసహనం వచ్చిందో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. రాష్ట్రాల్లో పాలన గాడి తప్పినప్పుడు, అరాచకం రాజ్యమేలుతున్నప్పుడు ఆర్టికల్ 355 ప్రకారం కేంద్రం కలుగజేసుకునే అధికారం ఉందన్న విషయం సోము వీర్రాజు తెలుసుకోవాలని అన్నారు. గతంలో అనేక రాష్ట్రాల్లో ఇదే జరిగిందని గుర్తు చేశారు. 

‘‘రాష్ట్రంలో దారుణాలు, నేరాలపై, ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదంపై కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డా ఆందోళన వ్యక్తం చేసింది వాస్తవం కాదా? వివేకా హత్య కేసు విషయంలో సీబీఐపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన దాడిని మీరూ చూడలేదా? రోజూ రాష్ట్రంలో దళితులు, బడుగు వర్గాలపై జరుగుతున్న హింస మీకు కనపడలేదా?’’ అంటూ అచ్చెన్నాయుడు సూటి ప్రశ్నలు సంధించారు.  ఆయా రాష్ట్రాల్లో పరిస్థితులు చేజారినప్పుడు, కేంద్రం జోక్యం చేసుకునే అవకాశం, అధికారం ఉందన్న విషయాన్ని సోము వీర్రాజు తెలుసుకోవాలని అన్నారు. 

తాము జగన్‌పై చర్యలు కోరింది కూడా ప్రజా స్వామ్యబద్ధంగా, చట్టబద్ధంగానే అని గుర్తు చేశారు. నాడు తమ ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా ఆలోచించింది కాబట్టే ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ పాదయాత్రకు అనుమతి ఇచ్చామని, చట్టబద్ధంగా వ్యవహరించామని పేర్కొన్నారు. వైసీపీ మూకలు రాష్ట్రాన్ని చెరపట్టి చేస్తున్న విధ్వంసంపై పోరాడాల్సిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, అధికార పార్టీని, ప్రభుత్వాన్ని వెనకేసుకు రావడానికి ప్రయత్నించడం దారుణమని అన్నారు. 

ప్రత్యేక హోదా తీసుకొచ్చి ప్రతి జిల్లాను హైదరాబాద్ మాదిరి అభివృద్ధి చేస్తానన్న జగన్ రెడ్డి హామీని అమలు చేయమని కోరడం తప్పా అని ప్రశ్నించారు. ‘‘జగన్‌ను ప్రశ్నిస్తే మీకు వచ్చిన నష్టం ఏంటి? ప్రతిపక్ష పార్టీపై విమర్శలు మాని ప్రజాసమస్యలు, ప్రభుత్వ అరాచకాలపై పోరాటాలు చేయాలి’’ అని హితవు పలికారు. ఈ మేరకు ఆయన ఓ పత్రికా ప్రకటన జారీ చేశారు.

More Telugu News