Medical Conditions: శ్రద్ధ తీసుకోకపోతే.. చిన్న వయసులోనూ ఈ వ్యాధుల బెడద!

  • యుక్తవయసులోనే రక్తపోటు, మధుమేహం సమస్యలు
  • అనారోగ్యకర ఆహారం, జీవనశైలి దుష్ఫలితాలు
  • కొలన్ లేదా రెక్టమ్ కేన్సర్ ముప్పు
4 Serious Medical Conditions You are Never Too Young To Experience

వయసు మీద పడుతుంటే అనారోగ్య సమస్యలు పలకరిస్తుండడం సహజం. కాల క్రమేణా కణాల నష్టం కారణంగా ఇవి తలెత్తుతాయి. అంటే, యుక్త వయసులో ఉన్న వారికి వ్యాధుల ముప్పు ఉండదని కాదు. అనారోగ్యకర జీవనశైలి కారణంగా కొన్ని రకాల వ్యాధులు చుట్టుముట్టే ప్రమాదం యువతీ యువకులకు సైతం ఉంటుంది. 

రక్తపోటు
రక్తపోటు ఆరోగ్యవంతులైన వారిలో 120/80 ఉండాలి. అయితే, దీనిని మించి అధిక రక్తపోటుకు గురైతే మాత్రం అది గుండె ఆరోగ్యాన్ని, మూత్రపిండాల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. గుండె పోటు లేదా బ్రెయిన్ స్ట్రోక్ రిస్క్ ను ఎదుర్కోవాల్సి వస్తుంది. కుటుంబంలో గుండె జబ్బుల చరిత్ర ఉంటే చిన్న వయసులోనే వారసుల్లో ఇవి కనిపించొచ్చు. ఇటీవలి కాలంలో మనం 40-50 ఏళ్ల మధ్యలో సెలబ్రిటీల మరణాలు చూస్తున్నాం. యువతీ యువకులు డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిపోవడం కనిపిస్తోంది. గుండెకు సంబంధించి ఎక్కువ ముప్పు కలిగించే వాటిల్లో అధిక రక్తపోటు ఒకటి. అందుకే కనీసం మూడు లేదా ఐదు నెలలకు ఒకసారి బీపీ చెక్ చేయించుకోవాలి.

బవెల్ కేన్సర్
దీన్నే పేగు కేన్సర్ అని కూడా అంటారు. చిన్న పేగు, పెద్ద పేగు, పురీష నాళం (రెక్టమ్)లో ఎక్కడైనా ఇది రావచ్చు. దీనికి కచ్చితమైన కారణాలను ఇప్పటికీ గుర్తించలేదు. కాకపోతే అతిగా మద్యం సేవించే వారు, ఫైబర్ లేని ఆహారం తీసుకునే వారికి రిస్క్ ఎక్కువని పలు అధ్యయనాల్లో గుర్తించారు. ఎక్కువగా యుక్తవయసులో వారు దీని బారిన పడుతున్నారు. 1950ల్లో పుట్టిన వారితో పోలిస్తే 1990ల్లో పుట్టిన వారికి దీని రిస్క్ రెట్టింపు ఉంటుందట.

టైప్ 2 మధుమేహం
టైప్ 2 మధుమేహం రిస్క్ కూడా యువతీ యువకుల్లో పెరుగుతోంది. 14 నుంచి 25 ఏళ్ల వయసులోపు వారిలో ఈ కేసులు 20 శాతం పెరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి. మధుమేహం బారిన పడిన వారు దీన్ని నియంత్రణలో పెట్టుకోకపోతే అది శరీరంలోని కీలక అవయవ వ్యవస్థను దెబ్బతీస్తుంది.

ఆస్టియో పోరోసిస్
చిన్న వయసులో ఎముకల సాంద్రత ఎక్కువగా ఉంటుంది. 35 ఏళ్లకు వచ్చిన తర్వాత ఎముకలు ఈ సాంద్రతను క్రమంగా కోల్పోతుంటాయి. ఆస్టియోపోరోసిస్ సమస్య బారిన పడిన వారిలో ఇది మరింత వేగంగా జరుగుతుంది. అంటే ఎముకలను బలహీన పరుస్తుంది. దీంతో ఫ్రాక్చర్ల ముప్పు పెరుగుతుంది. జారి పడిపోయినా, బ్యాలన్స్ తప్పినా ఫ్రాక్చర్ల బారిన పడుతుంటారు. సాధారణంగా 50 ఏళ్ల పైబడిన వారిలో ఈ రిస్క్ ఎక్కువ. కానీ నేటి జీవనశైలితో 30, 40 ఏళ్లల్లోనూ దీని బారిన పడుతున్నారు. 

ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ, రోజువారీ వ్యాయామం చేస్తూ నిశ్చలమైన జీవనశైలికి దూరంగా ఉండాలి. ఉప్పు, చక్కెర వినియోగాన్ని తగ్గించాలి. పీచు పదార్థాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. మద్యపానం, సిగరెట్లకు స్వస్తి చెప్పాలి. ఏడాదికోసారి అయినా వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా సమస్యల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు.

More Telugu News