MS Dhoni: ఇన్ని అంశాలు పరిశీలించాకే నాడు ధోనీకి టీమిండియా కెప్టెన్సీ ఇచ్చారట!

What happened behind to give captaincy to Dhoni
  • టీమిండియా చరిత్రలో విజయవంతమైన సారథిగా ధోనీ
  • ఐసీసీ ట్రోఫీల్లో భారత్ ను విజేతగా నిలిపిన ఝార్ఖండ్ డైనమైట్
  • ధోనీకి కెప్టెన్సీ అప్పగించడంపై మాజీ సెలెక్టర్ భూపిందర్ వివరణ
భారత క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్ ఎవరంటే, మహేంద్ర సింగ్ ధోనీ అని ఠక్కున చెప్పేస్తారు. టీమిండియాతో పాటు ఐపీఎల్ పైనా తనదైన ముద్ర వేసిన ధోనీ... కెప్టెన్ అంటే ఇలా ఉండాలని ఒక బెంచ్ మార్క్ సెట్ చేశాడు. 

ధోనీ సారథ్యంలో చివరిసారిగా 2013లో చాంపియన్స్ ట్రోఫీ నెగ్గాక... టీమిండియా నాలుగుసార్లు ఐసీసీ టోర్నీల ఫైనల్స్ లో ఓడిపోయింది. అనేక పర్యాయాలు సెమీస్ లోనే వెనుదిరిగింది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి స్టార్ బ్యాట్స్ మన్లు కెప్టెన్లుగా పగ్గాలు చేపట్టినా టీమిండియా తలరాత మారలేదు. మళ్లీ ధోనీ రావాలనే వారు కూడా ఉన్నారంటే... ఈ ఝార్ఖండ్ డైనమైట్ ఎలాంటి ముద్ర వేశాడో స్పష్టమవుతుంది. 

అసలు... ధోనీలో ఏముంది? ఏం చూసి నాడు సెలెక్టర్లు అతడికి కెప్టెన్సీ ఇచ్చారు? అనే ప్రశ్నలకు మాజీ సెలెక్టర్ భూపిందర్ సింగ్ సీనియర్ ఓ ఇంటర్వ్యూలో సమాధానమిచ్చారు. 

"అనుభవజ్ఞుడైన ఆటగాడికి కెప్టెన్సీ పగ్గాలు ఇవ్వడం సాధారణమైన విషయమే. కానీ, అతడి క్రికెటింగ్ తెలివితేటలు, బాడీ లాంగ్వేజ్, ముందుండి జట్టును నడిపించడం, అనేకమంది సభ్యులుండే జట్టులో వ్యక్తులవారీగా ఆటగాళ్లతో వ్యవహరించే విధానం చాలా అవసరం. ఇవన్నీ మేం ధోనీలో చూశాం. ఆట పట్ల అతడి దృక్పథాన్ని గమనించాం. అతడి బాడీ లాంగ్వేజ్, ఇతర ఆటగాళ్లతో అతడు మాట్లాడే విధానం... వీటన్నింటిలోనూ మాకు పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది" అని భూపిందర్ సింగ్ సీనియర్ వివరించారు.
MS Dhoni
Captaincy
Team India

More Telugu News