Dwarampudi Chandrasekhar Reddy: పవన్.. తోక ముడిచావా? నీ ప్రకటన కోసం ఎదురు చూస్తున్నా: ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి

mla dwarampudi chandrashekar reddy fires on janasena chief pawan
  • కాకినాడలో పవన్ తనపై పోటీ చేస్తారో లేదో చెప్పాలన్న ద్వారంపూడి
  • ముద్రగడ పద్మనాభం సలహా తీసుకుని తనపై పోటీ చేయాలని సలహా
  • పవన్ ఏ నిర్ణయం తీసుకోకపోవడం బాధాకరమంటూ సెటైర్లు 
  • ముద్రగడ ప్రకటనపై తమ కుటుంబం తరపున థ్యాంక్స్ చెప్పిన ద్వారంపూడి
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు కాకినాడ సిటీ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మరోసారి సవాల్ విసిరారు. పవన్ తనపై పోటీ చేస్తారో లేదో చెప్పాలని ప్రశ్నించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘పవన్ కల్యాణ్ కాకినాడలో నా మీద పోటీ చేస్తాననే ప్రకటన చేయకుండా కాకినాడ నుంచి తోక ముడుచుకుని వెళ్లిపోతున్నారు. ఆయన ప్రకటన కోసం ఎదురు చూస్తున్నా. ఏమీ చెప్పకుండా వెళ్తే నా మీద చేసిన వ్యాఖ్యలు పవన్ వెనక్కి తీసుకున్నట్లుగా భావిస్తాను’’ అని చెప్పారు.

ముద్రగడ పద్మనాభం సలహా తీసుకుని పవన్ తన మీద పోటీ చేయాలని ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి అన్నారు. ‘‘ఇప్పటి వరకు నా మీద పోటీ చేస్తారని ఎదురుచూశా. నా మీద పోటీ చేస్తానని నిర్ణయం తీసుకోకపోవడం బాధాకరం’’ అని సెటైర్లు వేశారు. చంద్రబాబు చెప్పు చేతుల్లో ఉన్న పార్టీ జనసేన అన్నారు. పవన్ కల్యాణ్ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలన్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబు కుట్రలో భాగంగానే పవన్ తనను తిట్టడానికి వారాహి యాత్ర మొదలుపెట్టారని మండిపడ్డారు. ఎవరో ఏదో చెబితే నమ్మేసి నోటికొచ్చినట్టు తనపై ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని.. తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. అసలు ఎవరు ఎక్కడ పోటీ చేస్తారో తెలియని దౌర్భాగ్య పరిస్థితిలో జనసేన ఉందన్నారు. ముద్రగడ ప్రకటన చేయడంపై ద్వారంపూడి సంతోషం వ్యక్తం చేశారు. తమ కుటుంబం తరపున ధన్యవాదాలు చెప్పారు.
Dwarampudi Chandrasekhar Reddy
Pawan Kalyan
kakinada
TDP
YSRCP
Mudragada Padmanabham

More Telugu News