Adipurush: ‘ఆదిపురుష్’ని బ్యాన్ చేయండి.. ప్రధానికి సినీ వర్కర్స్ అసోసియేషన్ లేఖ

all india cine workers association wrote a letter to pm modi for ban on adipurush
  • దేవుళ్లను వీడియో గేమ్‌లలో పాత్రల్లా చిత్రీకరించారన్న ఏఐసీడబ్ల్యూఏ
  • హిందువుల మనోభావాలను, సనాతన ధర్మాన్ని తీవ్రంగా దెబ్బతీసేలా సినిమా ఉందని ఫైర్ 
  • థియేటర్లలో వెంటనే సినిమాను నిలిపివేయాలని ప్రధానికి విజ్ఞప్తి
  • ‘ఆదిపురుష్‌’ దర్శకుడు, రచయితపై కేసు పెడతామని వెల్లడి
‘ఆదిపురుష్‌’ విడుదలైనప్పటి నుంచి ఒకదాని తర్వాత మరొకటి వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. ఈ సినిమాను నిషేధించాలంటూ ప్రధాని నరేంద్ర మోదీకి ఆల్‌ ఇండియన్‌ సినీ వర్కర్స్‌ అసోసియేషన్‌ (ఏఐసీడబ్ల్యూఏ) లేఖ రాసింది. సినిమా స్క్రీన్‌ప్లే, అందులోని డైలాగులు రాముడు, హనుమంతుడి గౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని, వెంటనే సినిమాను నిలిపివేయాలని కోరింది.

‘‘ఆదిపురుష్‌ సినిమా హిందువుల మనోభావాలను, సనాతన ధర్మాన్ని తీవ్రంగా దెబ్బతీసేలా ఉంది. శ్రీరాముడు అందరికీ దేవుడు. ఈ సినిమాలోని డైలాగులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి భారతీయుడిని బాధపెట్టేలా ఉన్నాయి’’ అని లేఖలో పేర్కొన్నారు. దేవుళ్లను వీడియో గేమ్‌లలో పాత్రల్లా చిత్రీకరించారని మండిపడ్డారు.

ఇంతటి అవమానకరమైన చిత్రం.. భారతీయ సినిమా చరిత్రలో భాగం కాకూడదని సినీ ఆర్టిస్టుల అసోసియేషన్ చెప్పింది. శ్రీరాముడిపై, రామాయణంపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని పూర్తిగా విధ్వంసం చేసేలా ఈ సినిమా ఉందని మండిపడింది. థియేటర్లలో సినిమా ప్రదర్శనను వెంటనే నిలిపివేయాలని, భవిష్యత్తులో ఓటీటీలో కూడా ప్రదర్శించవద్దని, ఈ మేరకు ఆదేశించాలని ప్రధాని మోదీని కోరింది. ‘ఆదిపురుష్‌’ దర్శకుడు, రైటర్‌పై కేసు పెడతామని చెప్పింది.

రామాయణం ఆధారంగా దర్శకుడు ఓంరౌత్‌ తెరకెక్కించిన సినిమా ఆదిపురుష్. ఇందులో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌.. రాముడిగా నటించారు. సీతగా కృతిసనన్‌ కనిపించారు. జూన్‌ 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ఇప్పటి వరకు రూ.340 కోట్లు వసూలు చేసిందని చిత్ర బృందం ప్రకటించింది.
Adipurush
All India Cine Workers Association
Narendra Modi
Prabhas
om raut

More Telugu News