Jagannath Rath Yatra: పూరీలో అంగరంగ వైభవంగా జగన్నాథుడి రథయాత్ర

Jagannath Rath Yatra begins President PM Home Minister offer wishes as devotees throng Puri
  • సాగర తీర పట్టణంలో ఘనంగా ప్రారంభం
  • సుమారు 10 లక్షల మంది భక్తుల రాక
  • శుభాకాంక్షలు చెప్పిన ప్రధాని, కేంద్ర హోంమంత్రి, ఒడిశా సీఎం
  • ఢిల్లీలోని జగన్నాథ మందిరంలో రాష్ట్రపతి ప్రార్థనలు

ప్రఖ్యాత పూరీ జగన్నాథుడి రథయాత్ర మంగళవారం ఘనంగా ప్రారంభమైంది. భారీ ఎత్తున భక్తులు తరలి వచ్చారు. భక్తుల రాక ఇంకా కొనసాగుతూనే ఉంది. సుమారు 10 లక్షల మంది భక్తులు హాజరవుతారని భావిస్తున్నట్టు శ్రీ జగన్నాథ్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్య పరిపాలనా అధికారి రంజన్ కుమార్ దాస్ తెలిపారు. బలభద్ర, సుభద్ర, శ్రీ జగన్నాథుడి విగ్రహాలను శ్రీ గుండిచ ఆలయం వరకు రథ యాత్రతో తోడ్కొని వెళతారు. 12వ శతాబ్దం నాటి మందిరం ముందు ఉంచుతారు. 

భారీ సంఖ్యలో భక్తులు వస్తున్నందున 80 ప్లాటూన్ల బలగాలను మోహరించారు. ఒక్కో ప్లాటూన్ లో 30 మంది పోలీసులు ఉంటారు. సాగరతీరం కావడంతో తీరంలో కోస్ట్ గార్డ్ కు చెందిన హెలికాప్టర్ సైతం గస్తీ నిర్వహిస్తోంది. పూరీ రథయాత్ర నేపథ్యంలో 125 ప్రత్యేక రైళ్లను రైల్వే శాఖ నడుపుతోంది. 

పూరీ రథయాత్ర ప్రారంభానికి ముందు ఢిల్లీలోని హౌజ్ కాస్ లో ఉన్న జగన్నాథ్ మందిరం వద్ద రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రార్థనలు నిర్వహించారు. పూరీ రథయాత్ర సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ‘‘ఈ పవిత్ర ఉత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా జగన్నాథ స్వామి మన జీవితాలను ఆరోగ్యం, సంతోషం, ఆధ్యాత్మిక భావనలతో నిండుగా ఉంచాలని కోరుకుంటున్నాను’’ అంటూ ప్రధాని ట్వీట్ చేశారు. 

కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సైతం ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు. కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, ధర్మేంద్ర ప్రధాన్ పూరీ చేరుకున్నారు. పూరీ శంకరాచార్య స్వామి అయిన నిశ్చలానంద సరస్వతి ఆశీర్వాదం తీసుకున్నారు.

  • Loading...

More Telugu News