Visakhapatnam: బాలికపై రెండేళ్లుగా జ్ఞానానంద ఆశ్రమ నిర్వాహకుడు పూర్ణానంద స్వామీజీ అత్యాచారం!.. అర్ధరాత్రి అరెస్ట్!

Visakha Purnananda Swamy Arrested On Pocso Charges
  • ఏడాదిగా బాలికను గొలుసులతో తన గదిలో బంధించిన స్వామీజీ
  • పనిమనిషి సాయంతో ఆశ్రమం నుంచి తప్పించుకున్న బాలిక
  • రైలులో పరిచయమైన మహిళ సాయంతో విషయం వెలుగులోకి
అత్యాచారం ఆరోపణలపై విశాఖపట్టణంలోని జ్ఞానానంద ఆశ్రమ నిర్వాహకుడు పూర్ణానంద స్వామీజీ అరెస్టయ్యారు. స్వామీజీ తనపై రెండేళ్లుగా అత్యాచారం చేస్తున్నారన్న రాజమహేంద్రవరానికి చెందిన అనాథ బాలిక (15) ఫిర్యాదుపై గత అర్ధరాత్రి స్వామీజీని పోలీసులు అరెస్ట్ చేశారు. చిన్న వయసులోనే తల్లిదండ్రులు చనిపోవడంతో బాలికను చేరదీసిన బంధువులు ఐదో తరగతి వరకు చదివించారు. 

రెండేళ్ల క్రితం విశాఖపట్టణంలోని కొత్త వెంకోజీపాలెంలో ఉన్న జ్ఞానానంద ఆశ్రమంలో చేర్పించారు. అక్కడ స్వామీజీ ఆమెతో ఆవులకు మేత వేయించడం, పేడ తీయించడం వంటి పనులు చేయించేవారు. రాత్రుళ్లు తన గదిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేసేవారు. ఏడాదిగా బాలికను తన గదిలోనే గొలుసులతో బంధించారు. ఎదురు తిరిగితే కొట్టేవారు. రెండు చెంచాల అన్నాన్ని మాత్రమే పెట్టేవారని, కాలకృత్యాలకు అనుమతించకపోయేవారని, వారానికి ఒకసారి మాత్రమే స్నానానికి వెళ్లనిచ్చేవారని బాలిక తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

రైలులో పరిచయమైన మహిళ సాయం
ఈ క్రమంలో ఈ నెల 13న పనిమనిషి సాయంతో బాలిక ఆశ్రమం నుంచి బయటపడింది. రైల్వే స్టేషన్‌కు చేరుకుని తిరుమల ఎక్స్‌ప్రెస్ ఎక్కింది. అక్కడ తనకు పరిచయమైన ప్రయాణికురాలికి తన బాధను చెప్పుకుంది. ఆ మహిళ బాలికను తనతోపాటు తీసుకెళ్లి రెండు రోజుల క్రితం కృష్ణా జిల్లా కంకిపాడులోని ఓ హాస్టల్‌లో చేర్పించేందుకు ప్రయత్నించింది. అయితే, పోలీసుల నుంచి లేఖ తీసుకొస్తేనే జాయిన్ చేసుకుంటామని చెప్పడంతో కంకిపాడు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పోలీసులు ఇచ్చిన అనుమతి లేఖను తీసుకున్నారు. 

స్వామీజీపై పోక్సో కేసు
అక్కడి నుంచి బాలికను తీసుకుని బాలల సంక్షేమ కమిటీ (సీడబ్ల్యూసీ)కి వెళ్లగా, ఆశ్రమంలో తాను అనుభవించిన నరకం గురించి బాలిక చెప్పుకొచ్చింది. నిర్ఘాంతపోయిన వారు బాలికతో కలిసి విజయవాడ దిశ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. స్వామీజీపై పోక్సో కేసు నమోదు చేసుకున్న పోలీసులు వైద్య పరీక్షల నిమిత్తం బాలికను ఆసుపత్రికి తరలించారు. బాలిక ఫిర్యాదుపై స్వామీజీని గత అర్ధరాత్రి విశాఖలో అదుపులోకి తీసుకున్నారు. 

అంతా అబద్ధం
బాలిక ఆరోపణల్లో ఎంతమాత్రమూ నిజం లేదని పూర్ణానంద స్వామీజీ కొట్టిపడేశారు. ఆశ్రమ భూములను కొట్టేయాలని కొందరు చూస్తున్నారని, అందులో భాగంగానే కుట్ర చేసి బాలికతో ఇలా ఆరోపణలు చేయిస్తున్నారని అన్నారు. దీనిపై న్యాయపోరాటం చేస్తానని స్పష్టం చేశారు. కాగా, ఆశ్రమం నుంచి బాలిక అదృశ్యమైనట్టు ఈ నెల 15న ఆశ్రమ నిర్వాహకులు ఫిర్యాదు చేశారు.
Visakhapatnam
Purnananda Swamy
Rajamahendravaram
Andhra Pradesh

More Telugu News