muthireddy yadagiri reddy: బహిరంగంగా కూతురు వాగ్వాదం.. తన బిడ్డను తప్పుదారి పట్టిస్తున్నారని ముత్తిరెడ్డి కంటతడి

MLA Muthireddy Yadagiri Reddy weeps after daughter argument
  • చేర్యాల భూములపై తండ్రిని నిలదీసిన ముత్తిరెడ్డి కూతురు
  • తన కూతురును రాజకీయ ప్రత్యర్థులు తప్పుదోవ పట్టిస్తున్నారని కంటతడి
  • తాను తప్పు చేస్తే ప్రజలే తనకు బుద్ధి చెబుతారని వ్యాఖ్య

జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డితో కూతురు తుల్జాభవానీ వాగ్వాదానికి దిగారు. చేర్యాల భూవివాదంలో తన సంతకంపై ఎమ్మెల్యే అయిన తన తండ్రిని బహిరంగంగా నిలదీశారు. ప్రజాప్రతినిధులు, అధికారుల ముందే భూములకు సంబంధించిన వివరాలపై ప్రశ్నించారు. అన్నింట్లో తన తండ్రి ఇరికించాడని ఆవేదన వ్యక్తం చేశారు. హరిత దినోత్సవం కార్యక్రమం సందర్భంగా తండ్రీకూతురు ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా చేర్యాల స్థల వివాదంపై ప్రశ్నించారు. తనకు తెలియకుండా తన పేరుతో కొనడంపై తాను ఎన్నో ఇబ్బందులు పడ్డానని చెప్పారు. అయితే తాను సంతకం చేయలేదని, తన సంతకం ఎవరు చేశారో తెలియదని కూతురుకు చెప్పారు ముత్తిరెడ్డి. ఆస్తి ఇచ్చానని తనపై కేసులు వేస్తున్నావా? అని ఆయన ప్రశ్నించారు.

ఈ విషయమై ముత్తిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, తన కుమార్తెను రాజకీయ ప్రత్యర్థులు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటుంబ సమస్యను ప్రత్యర్థులు పావుగా వాడుకున్నారని ఆరోపించారు. తన మనోస్థైర్యాన్ని దెబ్బతీసే కుట్ర జరుగుతోందని కంటతడి పెట్టుకున్నారు. తన కుటుంబ సమస్యను రాజకీయం చేయడం సరికాదని, తన కుమార్తెకు తన సొంత ఆస్తి ఇస్తే మోసం ఎలా అవుతుందని ప్రశ్నించారు. తప్పు చేస్తే ప్రజాక్షేత్రంలో ప్రజలే తనకు బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా మళ్లీ తానే గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. 

కాగా, తన సంతకాన్ని ఫోర్జరీ చేసి చేర్యాలలో తన పేరు మీద ఉన్న భూమిని ఆయన తన పేరు మీదకు మార్చుకున్నారని ముత్తిరెడ్డి కూతురు ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో ఇటీవల ఫిర్యాదు చేశారు.

  • Loading...

More Telugu News