Shahid Afridi: అహ్మదాబాద్‌లో ఆడేందుకు ఇబ్బందేంటి?.. ఏం నిప్పులు కురిపిస్తుందా?: పీసీబీపై షాహిద్ అఫ్రిది మండిపాటు

Is Ahmedabad Pitch Haunted Shahid Afridi Questions Pakistan Cricket Board Over World Cup Stance
  • ప్రపంచకప్ లో అహ్మదాబాద్‌లో మ్యాచ్ ఆడతామో లేదోనన్న పీసీబీ
  • దీని వెనుక కారణం ఏంటో పీసీబీ చెప్పాలన్న అఫ్రిది 
  • అహ్మదాబాద్ పిచ్ వేటాడుతుందా? అంటూ అసహనం

పాకిస్థాన్‌ క్రికెట్ బోర్డు (పీసీబీ)పై పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది మండిపడ్డాడు. భారతదేశంలో జరిగే వన్డే ప్రపంచకప్ సందర్భంగా అహ్మదాబాద్‌లో ఆడతామో? లేదో? అంటూ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించాడు. అహ్మదాబాద్‌లో మ్యాచ్‌ ఆడేందుకు నిరాకరించడం వెనుక కారణం ఏంటో చెప్పాలని ప్రశ్నించాడు.

‘‘అహ్మదాబాద్ పిచ్‌పై ఆడటానికి ఎందుకు నిరాకరిస్తున్నారు? అది నిప్పులు కురిపిస్తుందా? లేకపోతే వేటాడుతుందా? వెళ్లి అక్కడ ఆడాలి.. గెలవాలి. ఇవి మీరు ఊహించిన సవాళ్లు అయితే.. అక్కడికి వెళ్లి అద్భుతమైన విజయం సాధించి వాటిని అధిగమించాలి’’ అని సూచించాడు.

భారత్‌ను వారి సొంత మైదానంలో ఓడించడానికి వచ్చిన అవకాశాలపై పీసీబీ దృష్టిపెట్టాలని అఫ్రిది చెప్పాడు. అంతేకానీ వెనుకడుగు వేయకూడదని అన్నాడు. ఏదైనా సరే సానుకూల దృక్పథంతో నిర్ణయం తీసుకోవాలని తెలిపాడు. 

‘‘చివరికి పాకిస్థాన్ జట్టు విజయం సాధించిందా లేదా అనేదే ముఖ్యం. దీన్ని సానుకూలంగా తీసుకోండి. వారు (టీమిండియా) అక్కడ సౌకర్యవంతంగా ఉంటే ఉండనివ్వండి. మీరు వెళ్లండి.. స్టేడియం నిండా ఉన్న భారతీయ ప్రేక్షకుల ముందు విజయం సాధించండి. మీకు లభించిన విజయాన్ని వారికి చూపించండి’’ అని చెప్పాడు. 

ఆసియా కప్‌ వేదికలు, మ్యాచ్ తేదీలు ఇప్పటికే ఖరారయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ కప్‌ షెడ్యూల్‌ను త్వరలోనే ఐసీసీ ప్రకటించే అవకాశం ఉంది. అక్టోబర్‌ - నవంబర్‌ మధ్య వన్డే ప్రపంచకప్‌ మన దేశంలో జరగనుంది. ఇప్పటికే ముసాయిదా షెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటించగా.. నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా అక్టోబర్‌ 15న భారత్ - పాకిస్థాన్‌ మ్యాచ్‌ జరగాల్సి ఉంది.

  • Loading...

More Telugu News