Telangana University: లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ తెలంగాణ వర్సిటీ వీసీ

Telangana University VC caught redhandedly by ACB Officials
  • పరీక్షా కేంద్రం ఏర్పాటుకు లంచం డిమాండ్ చేసిన రవీందర్ గుప్తా
  • రూ.50 వేలు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసిన వీసీ
  • ఏసీబీని ఆశ్రయించిన బాధితుడు.. లంచం ఇస్తుండగా పట్టుకున్న అధికారులు
తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రవీందర్ గుప్తా లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. వర్సిటీ తరఫున పరీక్షా కేంద్రం ఏర్పాటు చేసేందుకు ఓ వ్యక్తి వద్ద డబ్బు తీసుకుంటూ అధికారులకు పట్టుబడ్డారు. శనివారం వీసీ రవీందర్ గుప్తా ఇంట్లో ఆయనను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు సమాచారం. 

తెలంగాణ వర్సిటీలో అక్రమాలు జరుగుతున్నాయంటూ కొంతకాలంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అవినీతి నిరోధక శాఖ, విజిలెన్స్, ఎన్ ఫోర్స్ మెంట్ శాఖల అధికారులు వర్సిటీలో సోదాలు జరిపారు. వర్సిటీలో అక్రమ నియామకాలకు సంబంధించిన ఆధారాలను ఈ సోదాల్లో గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వర్సిటీ తరఫున పరీక్షా కేంద్రం ఏర్పాటు చేసేందుకు రవీందర్ గుప్తా డబ్బులు డిమాండ్ చేశారంటూ ఓ వ్యక్తి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. అధికారుల సూచనలతో వీసీకి లంచం ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు.

శనివారం ఉదయం హైదరాబాద్ లోని వీసీ రవీందర్ గుప్తా ఇంటికి వెళ్లిన బాధితుడు.. వీసీకి రూ.50 వేలు అందించాడు. పథకం ప్రకారం అక్కడికి చేరుకున్న ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా వీసీని పట్టుకున్నారు. వీసీని అదుపులోకి తీసుకున్న అధికారులు.. ఆయన ఇంట్లో సోదాలు జరిపి కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అయితే, ఈ ఘటనపై అధికారులు ఇంకా ప్రకటన విడుదల చేయలేదు.
Telangana University
VC Ravinder Gupta
ACB
Bribe

More Telugu News