Chandrababu: చంద్రశేఖర్ అనే వ్యక్తి ఇచ్చిన రూంలో ఉండి ఎమ్మెల్యేగా పోటీ చేశాను... ఆ తరువాత అంతా మీరే చూసుకున్నారు: చంద్రబాబు

TDP Chief Chandrababu speech in Kuppam
  • కుప్పంలో చంద్రబాబు పర్యటన
  • రెండో రోజు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగం
  • నేటి తరానికి పాత కుప్పం ఎలా ఉండేదో తెలియదన్న టీడీపీ అధినేత 
  • ఇప్పుడున్నది అభివృద్ధి చెందిన కుప్పం అని వెల్లడి

కుప్పం బహిరంగ సభలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. కుప్పం నియోజకవర్గంలో టీడీపీకి 'లక్ష మెజారిటీయే లక్ష్యం' క్యాంపెయిన్ ను చంద్రబాబు ఈ సందర్భంగా ప్రారంభించారు. చంద్రబాబు మాట్లాడుతూ, కుప్పం నియోజకవర్గాన్ని తెలుగుదేశం ముందు... తరువాత అని చూడాలి అని పేర్కొన్నారు.

నేటి తరానికి నాటి కుప్పం ఎలా ఉండేదో తెలీదు, ఈ యువత చూస్తున్నది అభివృద్ది చెందిన కుప్పం అని వెల్లడించారు. నాడు అత్యంత వెనుకబడిన కుప్పం నియోజకవర్గాన్ని నేను నియోజకవర్గంగా ఎంచుకున్నాను అని తెలిపారు. 

"నా చిన్నప్పుడు పాఠశాలకు 6 కి.మీ దూరం నడిచి వెళ్లి కష్టపడి చదివా... అందుకే నేడు  ఈ స్ధాయిలో ఉన్నా. ఉమ్మడి రాష్ట్రానికి ఎవరు చేయనంత ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేశా. పట్టుదలతో ముందుకు వచ్చా... అంబేద్కర్, ఎన్టీఆర్, మోదీ వంటి గొప్ప నాయకుల చరిత్ర వెనుక పట్టుదలే కనిపిస్తుంది.

వెనుకబడిన ఈ ప్రాంతాన్ని అభివృద్ది చేయాలని కుప్పంకు వచ్చాను. చంద్రశేఖర్ అనే వ్యక్తి ఇచ్చిన రూంలో ఉండి ఎమ్మెల్యేగా పోటీ చేశాను. ఆ తరువాత అంతా మీరే చూసుకున్నారు. మీతో బంధం బలపడింది. అప్పట్లో కుప్పంలో రోడ్లు లేవు... స్కూళ్లు లేవు. నాడు ఇంటింటికి రెండు ఆవులు ఇస్తాను అంటే నవ్వారు, కానీ తరువాత పాడి పరిశ్రమ అభివృద్ది అయ్యింది. ఎక్కడా లేని విధంగా ఇక్కడ పాల ఉత్పత్తి పెరిగింది. ఆదాయం పెరిగింది. 

కుప్పం నియోజకవర్గంలో టెలిఫోన్ ఎక్స్చేంజ్ పెట్టిస్తాను అంటే నన్ను ఎగతాళి చేశారు. కానీ ఇప్పుడు చూడండి ఎంత మార్పు వచ్చిందో! అప్పట్లో కాలేజీలు లేవు... స్కూళ్లు లేవు... టీచర్లు ఇక్కడ ఉండేవాళ్లు కారు... టీచర్లు కూడా ఇక్కడి వాళ్లు కాదు. కుప్పంలో మన హయాంలో అభివృద్ది జరిగింది, వైసీపీ వచ్చిన తరువాత పనులు అన్నీ నిలిచిపోయాయి. 

కుప్పంలో నీళ్లు ఇస్తే మంచి పంటలు పండుతాయి అని నాడు ఇజ్రాయిల్ టెక్నాలజీ తీసుకువచ్చాను. దేశంలో తొలిసారి డ్రిప్ విధానం కుప్పంలో తీసుకువచ్చా. దీంతో నీటి లభ్యత పెరిగింది. కుప్పం ఒక ప్రయోగశాల... ఏ కార్యక్రమం మొదలు పెట్టినా కుప్పం నుంచే మొదలు పెట్టాను. కుప్పం నుంచి గెలవడం నా పూర్వ జన్మ సుకృతం అని భావిస్తాను. 

రాష్ట్రంలో ఇసుక కుంభకోణం... మద్యం కుంభకోణం... చివరికి మన కుప్పంలో కూడా అక్రమాలు మొదలుపెట్టారు. ఈ దుర్మార్గులు కుప్పాన్ని కూడా నేరస్తుల అడ్డాగా మార్చారు.   రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో చూడండి... విశాఖలో ఎంపీ కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేశారు. రాష్ట్రంలో ఎంపీ కుటుంబానికే రక్షణ లేదు అంటే, సామాన్య ప్రజలకు ఏం రక్షణ ఉంటుంది?

ప్రతిపక్షనేతగా ఉన్న నాకే రక్షణ లేకుంటే సామాన్య ప్రజలకు ఏం రక్షణ ఉంటుంది? సొంత బాబాయిని చంపి సీబీఐని మ్యానేజ్ చేస్తున్నారు. వివేకా కూతురు సునీత తండ్రి రుణం తీర్చుకునేందుకు సాగిస్తున్న పోరాట స్పూర్తిని అభినందిస్తున్నా. 

టీడీపీ మేనిఫెస్టో పథకాలు చూసి వైసీపీ నేతల కాళ్ల కింద భూమి కంపిస్తోంది. వాళ్ల కాళ్ల కిందకు నీళ్లు వచ్చాయి. నేను ఏదైనా మాట్లాడితే... ఇది సాధ్యమా అని అనుమానిస్తారు... కానీ 10 ఏళ్లలో అవన్నీ నిజమని తేలుతుంది. అప్పుడు ఆయన చెప్పింది నిజమే కదా అంటారు. వర్క్ ప్రం హోమ్ అండ్ ఆఫీస్ అనే హైబ్రిడ్  మోడల్  కుప్పం నుంచే ప్రారంభిస్తా. ప్రపంచంలోని అన్ని కంపెనీలతో అనుసంధానం చేసి ఇంటినుంచే పని చేసేలా ఉపాధి కల్పిస్తాం.

మేనిఫెస్టోలో ప్రకటించిన 6 పథకాలు సూపర్ సిక్స్ , ఈ పథకాలు ప్రతి ఇంటికి వివరించాలి. రాష్ట్రంలో 175 కి 175 సీట్లు మనమే గెలవాలి, సైకోలను ఇంటికి పంపాలి" అని చంద్రబాబు స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News