Asia Cup: ఆసియా కప్ కు తేదీల ఖరారు... టోర్నీ ఎక్కడ జరుగుతుందంటే...!

  • అనిశ్చితికి తెరదించిన ఆసియా క్రికెట్ కౌన్సిల్
  • ఆగస్టు 31 నుంచి ఆసియా కప్.. సెప్టెంబరు 17న ఫైనల్
  • ఆసియా కప్ కు సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న పాకిస్థాన్, శ్రీలంక 
  • నాలుగు మ్యాచ్ లకు పాక్ ఆతిథ్యం... మిగిలిన మ్యాచ్ లన్నీ శ్రీలంకలో!
  • ఒకే గ్రూపులో భారత్, పాకిస్థాన్
Asia Cup dates and hosts confirmed

భారత్, పాకిస్థాన్ మధ్య రాజకీయ వైరం కారణంగా ఈ ఏడాది ఆసియా కప్ వేదికపై అనిశ్చితి ఏర్పడింది. అయితే, ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ఆ అనిశ్చితికి తెరదించింది. టోర్నీలో 4 మ్యాచ్ లకు పాకిస్థాన్ ఆతిథ్యమిస్తుందని, మిగిలిన అన్ని మ్యాచ్ లు శ్రీలంకలో జరుగుతాయని ఏసీసీ పేర్కొంది. 

ఇక టోర్నీ తేదీలు కూడా ఖరారయ్యాయి. పాకిస్థాన్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ ప్రాంతీయ టోర్నీ ఆగస్టు 31న ప్రారంభం కానుంది. సెప్టెంబరు 17న జరిగే ఫైనల్ తో ఆసియా కప్ టోర్నీ ముగుస్తుంది. 

కాగా, ఈ 16వ ఆసియా కప్ టోర్నీలో భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్, నేపాల్ జట్లు పోటీపడనున్నాయి. టోర్నీలో భాగంగా 13 వన్డే మ్యాచ్ లు నిర్వహించనున్నారు. 

టోర్నీ తొలి దశలో మొత్తం 6 జట్లను రెండు గ్రూపులుగా విభజించనున్నారు. రెండు గ్రూపుల్లో టాప్-2లో నిలిచిన జట్లు సూపర్-4 దశకు చేరుకుంటాయి. సూపర్-4 దశలో ఈ నాలుగు జట్లలో టాప్-2లో నిలిచే జట్లు ఫైనల్ కు అర్హత సాధిస్తాయి. 

భారత్, పాకిస్థాన్, నేపాల్ ఒక గ్రూపులో ఉండగా.... శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ మరో గ్రూపులో ఉన్నాయి.

More Telugu News