New Delhi: స్కూటీ నడుపుతూ ఢిల్లీలో పెళ్లికూతురు రీల్.. రూ.6 వేల ఫైన్ తో పోలీసుల చదివింపులు

A video of a bride riding a scooter without a helmet had gone viral
  • రోడ్లపై ఇలాంటి సాహసాలు చేయొద్దంటూ పోలీసుల హెచ్చరిక
  • హెల్మెట్ పెట్టుకోకుండా ప్రయాణించడంతో యువతికి జరిమానా
  • సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఢిల్లీ పోలీసుల ట్వీట్
ఢిల్లీలో ఓ పెళ్లి కూతురు అందంగా ముస్తాబై మండపానికి బయలుదేరింది. అందరిలా అలంకరించిన కారులో వెళితే తన ప్రత్యేకత ఏముందని అనుకుందో ఏమో కానీ వెరైటీగా స్కూటీపై బయలుదేరింది. పనిలో పనిగా రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. పెళ్లి కూతురు ముస్తాబులో, పెళ్లి బట్టలు ధరించి స్కూటీ నడుపుతున్న ఈ వీడియో కాస్తా వైరల్ గా మారింది. ఈ వీడియోను ఆహ్వానంగా భావించిన ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు పెళ్లికైతే వెళ్లలేదు కానీ చదివింపుల రూపంలో రూ.6 వేల జరిమానా విధించారు. హెల్మెట్ ధరించకపోవడంతో పాటు రీల్స్ కోసం రోడ్లపైన ప్రమాదకరంగా ప్రయాణించిందనే కారణంతో ఈ మొత్తం ఫైన్ వేశారు.

అంతేకాదు, వైరల్ గా మారిన ఇదే వీడియోను ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కోసం ఉపయోగించుకున్నారు. సదరు యువతి ముఖం, స్కూటీ నెంబర్ ప్లేట్ కనిపించకుండా చేసి ట్రాఫిక్ పోలీసుల ట్విట్టర్ హ్యాండిల్ లో పోస్టు చేశారు. వేడుకల పేరుతో ఇలా ప్రమాదకరంగా ప్రయాణిస్తే మీకూ చదివింపులు తప్పవని హెచ్చరించారు. ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ, హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని సూచించారు. ట్రాఫిక్ పోలీసులు చేసిన ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారడం విశేషం!
New Delhi
Traffic police
Viral Videos
bride video
scooty ride
bride scooty ride
fine

More Telugu News