Narendra Modi: దక్షిణాదిపై గురి పెట్టిన బీజేపీ.. తమిళనాడు నుంచి పోటీకి మోదీ రెడీ!

PM Modi to contest 2024 Lok Sabha polls from Tamil Nadu
  • వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలని చూస్తున్న బీజేపీ
  • గత పర్యాయం వారణాసి నుంచి పోటీ చేసి యూపీలో హవా చూపెట్టిన మోదీ
  • మదురై నుంచి నిర్మలా సీతారామన్ ను పోటీకి దింపే యోచనలో పార్టీ
కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ సాధించాలని బీజేపీ టార్గెట్‌ గా పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికలకు ఇంకా ఏడాది మాత్రమే మిగిలి ఉండటంతో ఇప్పటి నుంచే అందుకు పక్కా ప్రణాళిక రచిస్తోంది. గత రెండు పర్యాయాలు ఉత్తరాదిలో హవాతో బీజేపీ అధికారం చేపట్టింది. అయితే పదేళ్ల పాలనలో సహజంగానే పెరిగే వ్యతిరేకతతో ఈసారి అక్కడ కొన్ని ఎంపీ స్థానాలను కోల్పోయే అవకాశం ఉందని బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తోంది. ఉత్తరాదిలో కోల్పోయే ఆ స్థానాలను దక్షిణాదిలో రాబట్టుకోవాలని ఆశిస్తోంది. ఇందుకోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా రంగంలోకి దిగబోతున్నారు. 

లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడు నుంచి పోటీ చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ సిద్ధమవుతున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత ఆయన వ్యక్తిగత ఇమేజ్  కొంచెం దెబ్బతిన్నది. ఈ నేపథ్యంలో తమిళనాడులోని 39 లోక్‌సభ స్థానాలకు గాను 25 స్థానాలు గెలుచుకోవాలనే లక్ష్యంతో మోదీ ఆ రాష్ట్రం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. గతంలో ఆయన వారణాసి నుంచి పోటీ చేసినప్పుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం తన మ్యాజిక్ చూపించారు. ఇప్పుడు అదే మ్యాజిక్ ను తమిళనాడులో రిపీట్ చేయాలని అనుకుంటున్నారని తెలుస్తోంది. 

నూతన పార్లమెంట్ ప్రారంభోత్సవ వేడుకలకు సింగోల్‌ను తీసుకొచ్చి అమర్చడం వెనుక ఇదే అతిపెద్ద కారణమని భావిస్తున్నారు. ఇప్పటివరకు తమిళనాడు నుంచి పోటీ చేసి ఏ ఒక్కరు కూడా ప్రధాని కాలేదు. ఇప్పుడు ఆ రికార్డును మోదీ బ్రేక్ చేయాలని చూస్తున్నారు. చాలా నెలల క్రితమే దాని ప్రణాళికాబద్ధమైన వ్యూహం రూపొందించారని సమాచారం. ఇక ఇప్పటిదాకా రాజ్యసభ ఎంపీగా ఉన్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను మదురై లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయించాలని కేంద్ర నాయకత్వం నిర్ణయించిందని తెలుస్తోంది.
Narendra Modi
2024
Lok Sabha
Tamilnadu
Nirmala Sitharaman
BJP

More Telugu News