Pawan Kalyan: సీఎం జగన్ కు ఫోన్ చేసి ఒక్కటే విషయం చెప్పాను: పవన్ కల్యాణ్

Pawan Kalyan says he talked to CM Jagan about criticism
  • కత్తిపూడిలో పవన్ కల్యాణ్ సభ
  • వైసీపీ అవినీతిపై తప్పకుండా ప్రశ్నిస్తానని ఉద్ఘాటన
  • పర్సనల్ విషయాల జోలికి రానని సీఎంకు చెప్పానని వెల్లడి
  • కానీ తనను దారుణమైన మాటలు అంటున్నారని ఆవేదన
  • ప్రజల కోసమే భరిస్తున్నానని స్పష్టీకరణ
ఎవరు అవినీతికి పాల్పడినా ప్రశ్నిస్తామని జనసేనాని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. తన గదిలో వైసీపీ అవినీతికి సంబంధించిన ఫైళ్లు ఎన్నో ఉన్నాయని, చదివేకొద్దీ వస్తుంటాయని తెలిపారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడిలో వారాహి యాత్ర సభలో పవన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైసీపీ అవినీతికి సంబంధించిన ఫైళ్లు చదువుతూ అలసిపోతానని, వీళ్లేంట్రా బాబూ ఇన్ని తప్పులు చేశారా అనిపిస్తుందని తెలిపారు. 

"2019 ఎన్నికల్లో జనసేన ఓడిపోయాక... ముఖ్యమంత్రి పదవీస్వీకార ఉత్సవానికి నన్ను కూడా ఆహ్వానించారు. దాంతో ఆ రోజున మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేశాను. ఆ రోజున ముఖ్యమంత్రికి ఫోన్ లో ఒక్కటే చెప్పాను... చాలా పద్ధతి గల ప్రతిపక్షంగా ఉంటాం. మీ పర్సనల్ విషయాల జోలికి రాకుండా, ఏదైనా విధాన పరమైన నిర్ణయాలపై విమర్శించాల్సి వస్తే మాత్రం విమర్శిస్తాం... మీ వైపు నుంచి తప్పులు లేకుండా చూస్కోండి అని చెప్పాను. 

మీకు 151 మంది ఎమ్మెల్యేలు, పెద్ద సంఖ్యలో ఎంపీలు వచ్చారంటూ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నానంటూ ముఖ్యమంత్రితో ఎంతో సహృదయతతో మాట్లాడాను. కానీ నా కళ్ల ముందు తప్పులు జరుగుతుంటే మాట్లాడకుండా ఎలా ఉండగలం? రాజకీయ పక్షంగా అది మా బాధ్యత. 

ఎప్పుడైతే భవన నిర్మాణ కార్మికుల సమస్యల గురించి మాట్లాడానో, ఇసుక దందాను ఎత్తిచూపానో అప్పటి నుంచి వైసీపీ వాళ్లు నన్ను తిట్టని రోజంటూ లేదు. ఇంట్లో ఉన్న నా నాలుగేళ్ల బిడ్డతో సహా తిడుతున్నారు. వైసీపీ అంత నీచంగా తయారైంది. 

నాకు వాళ్ల పర్సనల్ విషయాలు తెలియక కాదు. నాకు ప్రతి ఒక్కరి వ్యక్తిగత విషయాలు బాగా తెలుసు. వైసీపీ వాళ్లకు ఇంటెలిజెన్స్ కావాలి... నాకు ఇంటెలిజెన్స్ అవసరంలేదు... నాకు నా అభిమానులు చాలు. 2014లో పార్టీ పెట్టాక కాంగ్రెస్ నాయకులు ఏదో అంటే వాళ్లకు కౌంటర్ ఇచ్చాను... అంతటితో అది అయిపోయింది. ఆ తర్వాత జగిత్యాల నుంచి ఓ కుర్రాడు పెన్ డ్రైవ్ తో వచ్చాడు. అన్నా... నిన్ను తిట్టినవాళ్ల అందరి పర్సనల్ వీడియోలు ఈ పెన్ డ్రైవ్ లో ఉన్నాయి అన్నాడు. 

ఆ పెన్ డ్రైవ్ తీసుకున్నాను కానీ నాకు మనస్కరించలేదు... నా సంస్కారం ఒప్పుకోలేదు. ఓ నాయకుడ్ని ఓ అంశం మీదో ఓ పాలసీ మీదో మాట్లాడాలి తప్ప వ్యక్తిగత విషయాలపై మాట్లాడకూడదని భావించి, ఆ కుర్రాడ్ని పంపించి వేశాను.  

కానీ ఈ వైసీపీ నాయకులు ముఖ్యమంత్రితో సహా నన్ను దారుణంగా తిడతారు. ఇవన్నీ నేను ఎందుకు భరిస్తున్నాను? ఇవాళ భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటుల్లో నేనూ ఒకడ్ని. ఇలాంటి మాటలు పడాల్సిన అవసరం లేదు కదా. 

సగటు మనిషికి అన్యాయం జరిగితే సినిమాల్లో కథా రూపంలో, పాటల రూపంలో పెట్టుకుని తృప్తి పడలేక, ఎంతో వేదన చెంది ఏదో చేయాలన్న తపనతో బయటికి వచ్చాను. అందుకే ఇన్ని మాటలు అంటున్నా భరిస్తున్నాను. భగత్ సింగ్, చేగువేరా, నేతాజీ సుభాష్ చంద్రబోస్ లను స్ఫూర్తిగా తీసుకుని రాజకీయాల్లోకి వచ్చాను" అని పవన్ కల్యాణ్ వివరించారు.
Pawan Kalyan
Jagan
Janasena
Kathipudi
Varahi Yatra

More Telugu News