Bihar: బీహార్‌లో నాలుగు నెలల క్రితం చనిపోయాడనుకున్న వ్యక్తి.. కిడ్నాప్ ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి ఢిల్లీలో కనిపించిన వైనం!

Bihar man spotted after 4 months by relative eating momos in Noida
  • ఈ ఏడాది జనవరిలో అదృశ్యమైన భాగల్‌పూర్ వాసి
  • తన బావ, మామ కిడ్నాప్ చేశారంటూ బాధితుడి తండ్రి ఫిర్యాదు
  • మాసిన గడ్డం, దుస్తులతో నోయిడాలో కనిపించిన నిశాంత్
  • గుర్తుపట్టి పోలీసులకు అప్పగించిన కిడ్నాప్ ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి
బీహార్‌లోని భాగల్‌పూర్‌కు చెందిన ఓ వ్యక్తి నాలుగు నెలల క్రితం అదృశ్యమయ్యాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో అతడు మరణించి ఉంటాడని కుటుంబ సభ్యులు భావించారు. తాజాగా, ఆ వ్యక్తి నోయిడాలో టిఫిన్ చేస్తూ కనిపించాడు. అతడిని కిడ్నాప్ చేసినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి అతడిని గుర్తించి పోలీసులకు అప్పగించాడు.

ఈ ఏడాది జనవరి 31న నిశాంత్ అదృశ్యమయ్యాడు. అతడి కోసం వెతికినప్పటికీ ఫలితం లేకపోవడంతో అతడి తండ్రి సచ్చిదానంద్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన బావ రవి శంకర్ సింగ్, మామ నవీన్ సింగ్‌లు తన కుమారుడిని కిడ్నాప్ చేసినట్టు ఆరోపించారు. నెలలు గడుస్తున్నా కుమారుడి జాడ లేకపోవడంతో అతడు చనిపోయాడని కుటుంబ సభ్యులు భావించారు.

కిడ్నాప్ ఆరోపణలు ఎదుర్కొంటున్న రవిశంకర్ సింగ్ తాజాగా నోయిడాలోని ఓ మోమోల దుకాణంలో ఉండగా.. గెడ్డం పెరిగి, మురికి దుస్తులతో ఉన్న ఓ వ్యక్తితో దుకాణదారుడు గొడవ పడుతుండడం చూశాడు. వెంటనే దుకాణదారు వద్దకు వెళ్లి అతడికి కూడా మోమోలు ఇవ్వాలని కోరాడు. ఆ తర్వాత అతడిని పరీక్షించి చూడగా నిశాంత్ అని తెలుసుకున్నాడు.

వెంటనే అతడిని తీసుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. అక్కడి పోలీసులు ఆ తర్వాత అతడిని బీహార్ పోలీసులకు అప్పగించారు. అనంతరం అతడిని కోర్టులో ప్రవేశపెట్టారు. నిశాంత్ కిడ్నాపయ్యాడా? అయితే, ఢిల్లీ ఎలా చేరుకున్నాడు? అన్నదానిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిశాంత్‌ను కిడ్నాప్ చేశామంటూ ఆయన కుటుంబం తమను వేధించిందని, కోర్టులో తమకు న్యాయం జరుగుతుందని రవి ఆశాభావం వ్యక్తం చేశాడు.
Bihar
Bhagalpur
Kidnap
Noida
New Delhi

More Telugu News