Tihar Jail: తీహార్ జైలు గదుల నుంచి ఎగ్జాస్ట్ ఫ్యాన్ల తొలగింపు.. కారణం ఇదే!

Plastic exhaust fans and LEDs at dark spots in Tihar to avoid untoward incidents
  • జైలులో గ్యాంగ్‌స్టర్ టిల్లు తాజ్‌పురియా దారుణ హత్య
  • జైలులోని ఎగ్జాస్ట్ ఫ్యాన్లను ఆయుధాలుగా చేసుకున్న నిందితులు
  • వాటి స్థానంలో ప్లాస్టిక్ ఫ్యాన్లను అమర్చాలని నిర్ణయం
  • చీకటిగా ఉన్న ప్రదేశాల్లో ఎల్‌ఈడీ లైట్ల ఏర్పాటు
గ్యాంగ్‌స్టర్ టిల్లు తాజ్‌పురియా హత్య తర్వాత తీహార్ జైలు అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. జైలులోని ఐరన్ ఎగ్జాస్ట్ ఫ్యాన్లను తొలగించి వాటి స్థానంలో 2 వేలకుపైగా ప్లాస్టిక్ ఎగ్జాస్ట్ ఫ్యాన్లను అమర్చాలని నిర్ణయించారు. చీకటిగా ఉన్న ప్రదేశాల్లో ఎల్‌ఈడీ లైట్లను అమర్చనున్నారు. మే 2న జైలు గదిలో తాజ్‌పురియా దారుణ హత్యకు గురయ్యాడు. ఆయన హత్యకు జైలులోని ప్రమాదకరమైన వస్తువులను ఉపయోగించినట్టు ఢిల్లీ జైళ్ల శాఖ డీజీ సంజయ్ బిస్వాల్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయుధాలుగా ఉపయోగించేందుకు అనువుగా ఉండే వస్తువుల స్థానంలో ప్లాస్టిక్ వస్తువులను అమర్చనున్నారు. 

పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (పీడబ్ల్యూడీ) ఈ పని చేపట్టింది. తీహార్ జైలు నంబరు 1తోపాటు మిగతా వాటిలో ప్లాస్టిక్ ఫ్యాన్లు, ఎల్‌ఈడీ లైట్ల కోసం టెండర్లు ఆహ్వానించింది. టెండరు ప్రక్రియ ముగిసిన తర్వాత నెల రోజుల్లో పని పూర్తవుతుందని పీడబ్ల్యూడీ తెలిపింది. రోహిణి, మండోజి జైళ్లలోని ఫ్యాన్లు ఖైదీలకు అందుబాటులో లేనందున తీహార్ జైలు వార్డుల్లోని ఫ్యాన్లను మాత్రమే తొలగిస్తున్నట్టు అధికారులు తెలిపారు. తాజ్‌పురియా హత్య చీకట్లో జరిగిన నేపథ్యంలో వెలుతురు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఎల్‌ఈడీ లైట్లను అమరుస్తున్నట్టు పేర్కొన్నారు.
Tihar Jail
Plastic Exhaust Fans
LED Lights
New Delhi

More Telugu News