Priyanka Gandhi: కర్ణాటక తర్వాత మధ్యప్రదేశ్ కు 5 గ్యారెంటీలు ప్రకటించిన ప్రియాంకాగాంధీ.. ఆ హామీలు ఏమిటంటే..!

Priyanka Gandhi announces 5 guarantees for Madhya Pradesh
  • నిన్న మధ్యప్రదేశ్ లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన ప్రియాంకాగాంధీ
  • ప్రతి మహిళకు నెలకు రూ. 1,500 భృతిని ప్రకటించిన ప్రియాంక
  • రూ. 500కే వంట గ్యాస్ సిలిండర్
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ కీలక నేత ప్రియాంకాగాంధీ నిన్న ప్రారంభించిన సంగతి తెలిసిందే. జబల్ పూర్ లో నర్మదా నదికి పూజలను నిర్వహించిన అనంతరం, భారీ ర్యాలీతో ఆమె ప్రచారాన్ని ప్రారంభించారు. మరోవైపు ఇటీవల కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల ప్రచారంలో ఐదు హామీలతో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారెంటీ కార్డ్ కన్నడ ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. ఈ క్రమంలో మధ్యప్రదేశ్ లో సైతం ప్రియాంకాగాంధీ 5 గ్యారంటీలను ప్రకటించారు.

ప్రియాంక ప్రకటించిన 5 గ్యారంటీలు:
  • రాష్ట్రంలోని ప్రతి మహిళకు నెలకు రూ. 1,500 భృతి.
  • ప్రతి ఇంటికి రూ. 500కే వంట గ్యాస్ సిలిండర్.
  • 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్. 100 నుంచి 200 యూనిట్ల వరకు సగం ఛార్జీకే కరెంట్. 
  • రైతు రుణాల మాఫీ. 
  • రాష్ట్రంలో పాత పెన్షన్ స్కీమ్ అమలు.

ఈ 5 గ్యారంటీలను ప్రకటించిన తర్వాత ప్రియాంక మాట్లాడుతూ... నర్మదా మాత వద్దకు వచ్చామని, మేము అబద్ధాలు చెప్పమని అన్నారు. బీజేపీ వాళ్లు కూడా ఇక్కడకు వచ్చి హామీలు ఇస్తారని... కానీ వాటిని నెరవేర్చరని చెప్పారు. డబుల్ ఇంజిన్, ట్రిపుల్ ఇంజిన్ గురించి వారు మాట్లాడతారని ఎద్దేవా చేశారు. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలో కూడా వారు ఈ ఇంజిన్ల గురించి మాట్లాడారని... కానీ ఆ రాష్ట్రాల ప్రజలు బీజేపీని విశ్వసించలేదని అన్నారు. 

ఛత్తీస్ ఘడ్, హిమాచల్ ప్రదేశ్ లలో తాము ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్నామని ప్రియాంక చెప్పారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలను చూస్తే... అక్కడి పరిస్థితి ఎంత మెరుగ్గా ఉందో మీకు అర్థం అవుతుందని అన్నారు. మధ్యప్రదేశ్ లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే... ఇక్కడ జరగబోయే ఎంతో అభివృద్ధిని చూస్తారని చెప్పారు.
Priyanka Gandhi
Congress
Madhya Pradesh
5 Guarantees

More Telugu News